టీడీపీ అవిశ్వాసం .. పవన్ చూపించు నీ ప్రతాపం  

ఎరక్కపోయి వచ్చాడు.. ఇరుక్కుపోయాడు అన్నట్టుగా తయారయ్యింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి. కేంద్రానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అటు తిరిగి ఇటు తిరిగి పవన్ రాజకీయం మీద ప్రభావం చూపించడంతో పాటు ఆయన నిలకడలేని మనస్తత్వాన్ని, రాజకీయ అజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి.
బీజేపీ, టీడీపీ లోపాయికారీ ఒప్పందం వంటి ఆరోపణలు పక్కనపెడితే..లోక్ సభలో చాలా పార్టీలు అవిశ్వాస నోటీసులు ఇచ్చినప్పటికీ…టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవేశపెట్టిన నోటీసునే స్పీకర్ అనుమతించడంతో…దేశప్రజలం దరి దృష్టి ఏపీపై మళ్లింది. ప్రత్యేక హోదా సహా అనేక విభజన హామీల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఏపీ భవిష్యత్ కు అత్యంత కీలకంగా భావిస్తున్న అవిశ్వాస తీర్మానంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో జనసేన అధినేత నోరు ఎందుకు మెదపడంలేదు అనే విషయం పై ఇప్పుడు అందరిలోనూ చర్చ నడుస్తోంది. నిత్యం రాజకీయాల్లో మునిగితేలుతున్నప్పటికీ…ప్రస్తుత పరిణామాలతో తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

అభివర్ణించుకుంటున్న జనసేనుడు ఎందుకు మౌనంగా ఉన్నట్టు? నిజం చెప్పాలంటే…అసలు అవిశ్వాసమన్న అంశం ఇవాళ తెరపైకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. జనసేనతో పొత్తుకోసం తహతహలాడుతున్న వామపక్షాల నేతలు, పవన్ ఏర్పాటుచేసిన జేఎఫ్ సీ లో సభ్యులుగా ఉన్న ఉండవల్లి లాంటి నేతలు పదే పదే ఈ విషయం చెప్పుకున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెట్టడం ఒక్కటే మార్గమని, కానీ ఈ పని చేయడానికి టీడీపీ, వైసీపీలు భయపడుతున్నాయని, ఈ పార్టీలు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధంగా ఉంటే….తీర్మానానికి అనుకూలంగా 50 మంది సభ్యుల మద్దతు స్వయంగా తాను కూడగడతానని పవన్ గతంలో సవాల్ విసిరారు.

ప్రస్తుత తరుణంలో కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు. తీర్మానం ప్రవేశపెట్టానికే 50 మంది సభ్యుల మద్దతు కూడగడతానన్న జనసేనాని..ఇప్పుడు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలంటూ టీడీపీ అన్ని పార్టీల చుట్టూ తిరుగుతూ పోరాడుతోంటే…కనీసం ఒక్క ప్రకటనైనా పవన్ ఎందుకు చేయడం లేదు ? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వ్యక్తమవుతున్న సందేహాలివే. దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో జనసేనుడు ఉన్నాడా ..?