పార్టీ ఇంకా ప‌రిగెత్త‌లేదు.. అప్పుడే ఆధిప‌త్య పోరు..!     2018-04-16   04:31:04  IST  Bhanu C

ప‌శ్నిస్తానంటూ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన పార్టీ ఇంకా పుంజుకోనేలేదు! ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్ల‌నూ లేదు. ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించ‌నూలేదు. కార్య‌ద‌ర్శులు ఎవరో? ప‌్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఎవ‌రో? పార్టీకి కేడ‌ర్ ఏంటో కూడా ఇంకా నిర్ణ‌య‌మూ కాలేదు! అయితే, ఇంత‌లోనే పార్టీలో ఆధిప‌త్య పోరు రాజుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీపై ఏపీలో అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు స‌హా మెగా ఫ్యామిలీ అభిమానులు, యువ‌త ఓట్లు స‌హా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్లు కూడా బాగానే ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అయితే, ప‌వ‌న్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు కేడ‌ర్‌ను పూర్తిస్థాయిలో ఫాం చేయ‌లేదు. స‌రిక‌దా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్లీన‌రీ కూడా నిర్వ‌హించ‌లేదు. మ‌రోప‌క్క‌, తాను అధికారానికి దూర‌మంటూ ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాడు. ఇన్ని విష‌యాల నేప‌థ్యంలో ఇంకా పూర్తిస్థాయిలో ప‌రుగులు పెట్ట‌ని పార్టీలో.. నేతలు ఇప్ప‌టి నుంచే ఆధిప‌త్యం కోసం పోరాడుకుంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా జ‌న‌సేన‌లో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ప్రారంభ‌మైంది. ఇక్క‌డ‌ రెండు గ్రూపులుగా చీలిపోయిన నాయకులు ఎవరికి వారే యమునాతీరే అన్న చందాన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.