Janasena MP Ticket to Mega Brother

మెగా ఫ్యామిలీలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు ముక్కుసూటిత‌నం బాగా ఎక్కువ‌. ఆయ‌న చెప్పాల‌నుకున్న‌ది ఓపెన్‌గానే చెప్పి కాంట్ర‌వ‌ర్సీకి కార‌ణ‌మ‌వుతూ ఉంటారు. గతంలో ఓ ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చిన‌ట్టుగా మాట్లాడిన నాగ‌బాబుకు ప‌వ‌న్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇచ్చారు. నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ సినిమాలు చూడ‌మ‌ని కూడా వారు రెచ్చిపోయారు. ఎట్ట‌కేల‌కు నాగ‌బాబు త‌మ్ముడు విష‌యంలో కూల్ అయ్యారు. తాను గ‌తంలో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి ప్ర‌చారం చేశాన‌ని, ఇప్పుడు త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన‌కు ప్ర‌చారం చేయాల్సి వ‌స్తే చేస్తాన‌ని చెప్పారు. దీంతో త‌మ్ముడికి ద‌గ్గ‌ర‌య్యేందుకు నాగ‌బాబు సుముఖంగానే ఉన్న‌ట్టు ఆయ‌న వ్యాఖ్య‌ల ద్వారా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌న‌సేన బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా మారుతుంద‌న్న అంచ‌నాలు బ‌లంగా ఉన్నాయి. అధికార టీడీపీతో పాటు విప‌క్ష వైసీపీకి జ‌న‌సేన ధీటైన శ‌క్తిగా ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు కూడా అంచ‌నా వేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన ఏపీ, తెలంగాణ‌లో 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంపై ప‌వ‌న్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఇక తాను అనంత‌పురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని కూడా చెప్పేశారు.

ప‌వ‌న్ ఎన్నిక‌ల బ‌రిలో ఉంటే చిరు ఎంత వ‌ర‌కు స‌పోర్ట్ చేస్తాడ‌నేది చెప్ప‌లేం. ఇటీవ‌ల ప‌వ‌న్ ఇదే అంశంపై స్పందిస్తూ జ‌న‌సేన‌లోకి చిరు రాడ‌ని కూడా చెప్పేశాడు. ఇదిలా ఉంటే త‌న మ‌రో సోద‌రుడు నాగ‌బాబును మాత్రం జ‌న‌సేన నుంచి కాకినాడ త‌ర‌పున పోటీ చేయించే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెపుతున్నాయి. ఈ విష‌యాన్ని తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఓ నివేదిక ద్వారా ప‌వ‌న్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం.

కాకినాడ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం ఓట్లు చాలా ఎక్కువుగా ఉన్నాయి. గ‌తంలో ఇక్క‌డ చిరు ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు కూడా ఈ జిల్లాలో ఆ పార్టీ నాలుగు ఎమ్మెల్యే సీట్లు సాధించింది. కాకినాడ ఎంపీ సీటుకు ప్ర‌జారాజ్యం త‌ర‌పున పోటీ చేసిన చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. సో ఇక్క‌డ నుంచి జ‌న‌సేన త‌ర‌పున నాగ‌బాబు ఎంపీగా పోటీ చేస్తే గెలుపు సులువ‌వ్వ‌డంతో పాటు ఆ ఎఫెక్ట్ జిల్లా మొత్తంపై ఉండి జ‌న‌సేన ఇక్క‌డ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంద‌ని జ‌న‌సేన వ‌ర్గాలు ప‌వ‌న్‌కు నివేదించాయ‌ట‌. ఇవ‌న్నీ ప‌వ‌న్ ఇక్క‌డ నాగ‌బాబును ఎంపీగా పోటీ చేసేలా ప్రేరేపిస్తున్నాయ‌న్న టాక్ ఆ పార్టీ వ‌ర్గాల నుంచే వ్య‌క్త‌మ‌వుతోంది.