జగన్ కేసుల్లో స్పీడ్ పెంచిన ఈడీ ..బీజేపీ పాత్రపై అనుమానాలు  

రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేము. ఇప్పుడు వైసిపీ అధ్యక్షుడు జగన్ పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. బీజేపీతో వైసిపీఏ లోపాయకారి ఒప్పందం ఉంది అని అందరూ అనుమానిస్తున్న తరుణంలో జగన్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్ కు ఈడీ షాక్ ఇస్తోంది. ఆయన అక్రమాస్తుల కేసులో దర్యాపుతు ఇప్పుడు వేగం పెంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అంతే బీజేపీకి- వైసీపీ మధ్య సంబంధాలు ఏమైనా దెబ్బ తిన్నాయా ..? రాజకీయం గా క్లిష్టసమయంలో ఉన్న వైసీపీ పై బీజేపీ ఎందుకు కక్ష పెంచుకుంది అనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్రం అనుమతి లేనిదే ఈడీ అంత వేడి పెంచే అవకాశం లేదు .

అక్రమాస్తుల కేసులో ఇప్పుడు మొదటిసారిగా జగన్ సతీమణి వై.ఎస్. భారతి పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ లో చేర్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటులో వైఎస్ భారతిని ఐదో నిందితురాలిగా చేర్చారు. భారతీ సిమెంట్స్ లో పెట్టుబడులు పెట్టిన విషయంలో జగన్ తో పాటు భారతి పేరును కూడా ఛార్జిషీటులో చేర్చారు. భారతీ సిమెంట్స్ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ మూడు ఛార్జిషీట్లు దాఖలు చేయగా అందులో వైఎస్ భారతి ప్రస్తావన ఎక్కడా లేదు. సీబీఐ భారతి పేరు చేర్చకపోయినా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మాత్రం ఆమె పేరును చేర్చడం చర్చనీయాంశంగా మారింది.

కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం గ్రామాల సమీపంలో సున్నపురాయి నిక్షేపాలున్నాయి. ఇక్కడ దాదాపు రెండువేల ఎకరాలను భారతి సమెంట్స్ కు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతీ సిమెంట్స్ ద్వారా జగన్ ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అక్రమంగా పొందినట్లు సీబీఐ గుర్తించింది. అయితే సీబీఐ మాత్రం భారతి పేరును ఛార్జిషీట్ లో చేర్చలేదు. కాని ఈడీ విచారణ వేగవంతం చేయడంతో తాజాగా దాఖలు చేసిన ఛార్జి షీటులో భారతి పేరును చేర్చింది. దీంతో భారతి కూడా న్యాయస్థానానికి హాజరుకావాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఒక వైపు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ప్రధాని ఎప్పుడంటే అప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తున్నాడు. మరో వైపు మాత్రం జగన్ కేసులలో విచారణ వేగవంతం చేయడం దేనికి నిదర్శనమో తెలియడంలేదు. అసలు ఇప్పుడు మోదీనే అన్ని పార్టీలకు పెద్ద మిస్టరీగా మారిపోయాడు. గతంలో బీజేపీ పెద్దలు జగన్ కేసుల విషయంలో తాము ముందుకు వెళ్ళమని ఖచ్చితమైన హామీ ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితులు మారడంతో జగన్ లో నూ ఒకింత కంగారు మొదలయినట్టు సమాచారం.