వాళ్ల‌కు బాబు ఎందుకు టార్గెట్ అయ్యాడు...!     2018-04-16   23:51:41  IST  Bhanu C

దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై మాజీ ఐఏఎస్ అధికారులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా దండెత్తుతు న్నారు. ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం, రైతుల నుంచి భూములు లాక్కోవ‌డం, అగ్రి గోల్డ్ మోసం వంటి విష‌యాల‌ను వారు నేరుగా ప్ర‌స్తావిస్తూనే.. బాబుపై రాళ్లు వేస్తున్నారు. ఇవి నిజాలేనా? అని అనిపించే స్థాయిలో వారు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను మొద‌ట్లో రాజ‌కీయంగా ఎవ‌రి ప్రోత్సాహంతోనే చేసి ఉంటార‌ని అంద‌రూ భావించారు. అయితే, రాను రాను.. అధికారుల సంఖ్య పెరుగుతుండ‌డం, వారు చేస్తున్న విమ‌ర్శ‌ల స్థాయి కూడా పుంజుకోవ‌డం వంటి ప‌రిణా మాల‌ను గ‌మ‌నిస్తే.. దీనికి రీజ‌న్ ఏంటా? అనే ప్ర‌శ్న తెర‌మీదికి తెస్తోంది.

ఏపీ విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్రానికి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి, బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ ఐవైఆర్ కృష్ణారావు.. అనూహ్యంగా చంద్ర‌బాబును టార్గెట్ చేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ఆయ‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి అగ్రిగోల్డ్ స‌హా రైతుల భూముల విష‌యంలోనూ విమ‌ర్శ‌లు సంధించారు. అంతేకాదు, ఇటీవ‌ల రాజ‌ధాని అవ‌స‌ర‌మా? అంటూ పుస్త‌కం కూడా రాశాడు. అయితే, ఈ విమ‌ర్శ‌ల‌ను, పుస్త‌కాన్ని కూడా టీడీపీ నేత‌లు తీవ్రంగా దుయ్య‌బ‌ట్టి.. ఐవైఆర్‌.. వైసీపీతో అంట‌కాగుతున్నాడంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ నుంచి తొల‌గించిన నాటి నుంచి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నాడ‌ని ఆయ‌న‌పై విరుచుకుప‌డుతున్నారు.