ఇలా అయితే..పవర్..స్టార్ తిరగదేమో ..  

అసలే నాక్కొంచెం తిక్కుంది దానికి లెక్కుంది అంటూ కిక్కిచ్చే డైలాగులు చెప్పే పవన్ రాజకీయ ప్రస్థానం చాలా కాలంగా గందరగోళంగా కనిపిస్తోంది. ఆయన ఏ నిముషానికి ఏమి చేస్తాడో తెలియక పార్టీ నాయకులూ.. అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. పోనీలే ఈ మధ్య రాజకీయ స్పీడ్ పెంచాడు అనేసరికి సడన్ బ్రేకులు వేసి పార్టీని కుదుపులకు గురి చేస్తున్నాడు. గత ఎన్నికల ముందు అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అంటూ టీడీపీ-బీజేపీల కూటమికి మద్దతుగా పవన్ ప్రచారం చేసి ఆ పార్టీల గెలుపులో భాగం అయ్యాడు. ఇప్పుడు తనను సీఎం చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారాలు చూపిస్తా అంటున్నాడు. ఇవే కాదు పవన్ చెబుతున్న ఏ విషయాల్లోనూ క్లారిటీ కనిపించక అందరూ అయోమయంలో ఉండిపోతున్నారు.

ఉత్తరాంధ్రలో వరుస పెట్టి 45 రోజుల పాటు ప్రజా సమస్యలపై పర్యటిస్తానని చెప్పిన పవన్, పర్యటనను ఎక్కడికక్కడే ఆపేస్తూ బ్రేకుల మీద బ్రేకులు ఇస్తున్నారు.కంటిన్యూగా ప్రజాపోరాట యాత్రను కొనసాగించలేకపోతున్నారు. దీంతో పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశకు గురవడంతో పాటు,పవన్ రాజకీయాలపై మరోసారి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పర్యటనలో ఉండగానే వ్యక్తిగత సిబ్బందికి దెబ్బలు తగిలాయని కొన్ని రోజులు రిసార్ట్ కు పరిమితం అయిపోయారు. తర్వాత ఓ రెండు రోజుల పాటు కొనసాగించి తన భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది మైనారిటీలు ఉన్నారని చెప్పి ‘రంజాన్’ సెలవులు ఇచ్చాడు.
ఇవన్నీ పవన్ మీద అందరికి డౌట్ కలిగించేలా చేసింది.

అసలు పవన్ కి ప్రజల్లో తిరగడానికి సహనం ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్ నిత్యం ప్రజల్లోనే తిరుహుతున్నాడు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నాడు. ఎండా వచ్చినా.. వాన వచ్చినా ఆపకుండా జనాల్లోనే ఉంటున్నాడు. అయితే పవన్ మాత్రం ఏదో ఒక కుంటి సాకు చెప్తూ తన యాత్రను వాయిదా వేసేందుకే చూస్తున్నాడు. ఈ విషయంలో పవన్ పై ప్రజల్లో చులకన భావన ఏర్పడింది. ఎన్నో అంచనాలతో ఏర్పడిన జనసేన పార్టీ ఇలా ఎన్నికల సమయం వచ్చేసరికి కప్పగంతులు వేస్తుండడం ఆ పార్టీకి పెద్ద చేటు తీసుకురాబోతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ వల్లే ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి కనిపిస్తోంది.