పవన్ ఎర్ర జెండా పట్టుకున్నాడా ..వదిలేశాడా ..  

జనసేన పార్టీ నాయకులందరు ఎప్పుడూ మెడలో ఓ ఎర్ర కండువా వేసుకుని కనిపిస్తూ ఉంటారు. పవన్ డి కూడా ఎప్పుడూ వామపక్ష భావజాలమే అందుకే కాబోలు ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ వామపక్ష పార్టీలతో కలిసి మెలసి తిరుగుతూ పర్యటనలు చేసేవారు. ఆ పార్టీలు ఒక అడుగు ముందుకు వేసి మరీ మా కూటమి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని బహిరంగంగా ప్రకటించేసాయి. ఇక వచ్చే ఎన్నికల్లో వామపక్ష పారీలతో కలిసి పవన్ ఎన్నికల బరిలోకి వెళ్తాడు అని అందరూ అనుకున్నారు, సీపీఐ , సీపీఎం పార్టీలు కూడా అదే ఆశతో ఉన్నాయి. కానీ పవన్ మేము ఒంటరిగానే బరిలోకి వెళ్తామని ప్రకటించి ఆ ఇరు పార్టీలను గందరగోళం లోకి నెట్టేశాడు.

తాజాగా సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెబుతున్న మాటలను గమనిస్తే.. వారి మధ్య ఇప్పటిదాకా పొత్తు ప్రస్తావనే రానట్టు కనిపిస్తోంది. బీవీ రాఘవులు తాజాగా మీడియాతో మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ తమ పార్టీ విధివిధానాలను వెల్లడిస్తే.. ఆయన జనసేన పార్టీతో కలిసి పనిచేయడానికి సీపీఎం కు అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. అంటే ఇప్పటిదాకా వాళ్లంతా కలిసి భేటీలు నిర్వహించడాలు, కలిసి పోరాడడాలూ ఇవన్నీ ఏంటనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది.

వామపక్షాలు పవన్ ఇమేజ్ ని వాడుకుని లబ్ది పొందాలి అనుకుంటున్నాయి కానీ పవన్ మాత్రం వారిని పరిగణలోకి తీసుకోనట్టుగా కనిపిస్తోంది. బీవీ రాఘవులు తన తాజా మాటల్లో.. నాలుగేళ్ల పాటూ కేంద్రంతో కలిసి ఉండడం వల్ల రాష్ట్రానికి జరిగిన ద్రోహంలో వారికి కూడా భాగం ఉందనే అంటున్నారు. మరి అదే తరహాలో నాలుగేళ్ల పాటూ చంద్రబాబు నాయుడు భజన చేసి ఆ తర్వాత ఒక్కసారిగా విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ కు కూడా… తెదేపా వారి పాపాల్లో భాగం ఉందా లేదా అనే విషయాలకు వామపక్ష పార్టీల దగ్గర క్లారిటీ లేదు.

పవన్ బీజేపీ మీద పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా, విమర్శించకుండా తన రాజకీయ యాత్రలు చేస్తుండడం ఎర్ర పార్టీలకు మింగుడు పడడంలేదు. అందుకే జనసేన విడి విధానాల మీద క్లారిటీ కోరుతున్నాడు. అదీ కాకుండా పవన్ ఎక్కడ తమకు హ్యాండ్ ఇచ్చి ఎన్నికల సమయానికి బీజేపీతో కలిసిపోతాడో అనే సందేహం వారిలో కనిపిస్తోంది. అలా అయితే ఏపీలో పవన్ ని నమ్ముకుని ఒకటో రెండో సీట్లు సంపాదించుకుందామనుకున్న వారి ఆశలకు ఎక్కడ బ్రేక్ పడుతుందో అన్న ఆందోళన కూడా వారిలో కనిపిస్తోంది. ఇప్పటికైనా పవన్ వారికి పొత్తు విషయంలో క్లారిటీ ఇస్తాడో లేక కన్ప్యూజన్ లోనే కొట్టిమిట్టాడేలా చేస్తాడో చూడాలి.