కాంగ్రెస్ ఢిల్లీ ప్లాన్..తెలంగాణాలో సెట్ అవుతుందా ..  

ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్దీ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ సరి ఎలాగైనా తెలంగాణాలో అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పడే పడే స్థానిక నేతలకు సూచిస్తున్నాడు. దీంతో పాటు స్వయంగా ఆయనే రంగంలోకి దిగి పరిస్థితి చక్కబెట్టేందుకు ప్లాన్ లు వేస్తున్నాడు. ఇప్పటి వరకు టి. కాంగ్రెస్ అంటే … ఆధిపత్య పోరు.. కుమ్ములాటలు.. నాయకత్వలోపం ఇవే అందరికి గుర్తుకు వచ్చేవి. అందుకే రాహుల్ తెలంగాణ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి పరిస్థితి చక్కదిద్దే పనిలో ఉన్నాడు.

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముందస్తుగా ఎప్పుడు వచ్చినా సమయానికి సిద్ధం కావాలని కాంగ్రెస్ సీనియర్లను రంగంలోకి దించింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఇప్పటికే ఉన్న పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీలకు తోడు ఏఐసీసీ కార్యదర్శులకు ఆరేసి పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. ఆ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ , పార్లమెంట్ వ్యవహారాలను కూడా వారే పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.

వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ ఇలా ఆరేసి పార్లమెంటు స్థానాలకు కలిపి ఓ కార్యదర్శిని నియమించి బలం, బలగం, అభ్యర్థుల ఎంపికను వారికే అప్పగించింది. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఉండే నాయకత్వాన్ని పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రజలను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు ప్లాన్ చేసింది. ఎవరు మెరుగైన నాయకులు, ఎవరిని ఎంపిక చేయాలి.? ఎలా గెలవాలనేది వారు సూచిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల పాత్ర ఇందులో ఏమీ ఉండదు.. అంతా ఢిల్లీ ఏఐసీసీ కార్యదర్శులదే ఫైనల్ డెసిషన్. అయితే కాంగ్రెస్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. అసలే టి. కాంగ్రెస్ అంటేనే కాకలు తీరిన రాజకీయ ముదుర్లు ఎక్కువ. పైకి అంతా బాగున్నట్టు బిల్డప్ ఇచ్చినా లోలోపల మాత్రం గ్రూపు రాజకీయాలు నడపగల సమర్థులు. వీటన్నిటిని రాహుల్ ఎలా కంట్రోల్ చేస్తాడో చూడాలి.