మహేష్ బాబు నిద్రపోతున్నాడా?  

ఇప్పుడు ప్రతి అభిమాని నోటి నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇది. స్పైడర్ విడుదలకి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకు ప్రమోషన్స్ మొదలవలేదు. మహేష్ ఒక్క చానల్ కి కూడా ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. స్పైడర్ గురించి ఆడియో ఫంక్షన్లో మాట్లాడడం మినహాయిస్తే ఈ మధ్యకాలంలో తన సినిమా గురించి ఎవరితోనూ ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నాడు? అసలు స్పైడర్ సినిమాని ప్రమోట్ చేసే ఉద్దేశమే లేదా? కేవలం మురగదాస్ మాత్రమే అటు జాతీయ మీడియా కి, తమిళ మీడియా కి, మరోవైపు తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మహేష్ మాత్రం బయటకు రావడం లేదు.

భరత్ అనే నేను సినిమా బిజీలో పడి మహేష్ స్పైడర్ అనే సినిమా ఒకటి ఈ నెల 27న విడుదలవుతోంది అనే సంగతి మరచి పోయాడా? 120 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు మరీ ఇంత సైలెంట్ గా ఎలా ఉంటున్నారో అర్థం కావడం లేదు. తెలుగులో అంటే హీరో కోసమైనా జనాలు వెళతారు. మరి తమిళం పరిస్థితి ఏమిటి? అక్కడ తొలి సినిమా విడుదల చేస్తూ, తమిళ మీడియా కి కూడా దొరకడంలేదు మహేష్. ఇది సినిమా మీద బలమైన నమ్మకమా లేక ఏం ప్రమోట్ చేస్తాంలే అనే అలసత్వమా?

సాధారణంగానైతే మహేష్ సినిమా విడుదల సమయంలో మీడియాకి అందుబాటులో ఉంటాడు. దూకుడు నుంచి మొదలు తన ప్రతి సినిమా బాగా ప్రమోట్ చేసుకున్నాడు. మరి స్పైడర్ పట్ల మాత్రం ఎందుకింత అజాగ్రత్త?