పార్టీపై బాబు పట్టు తప్పిందా ..? టీడీపీలో నాయకుల అలకలేంటి..?  

క్రమశిక్షణకు మారుపేరు అయిన టీడీపీ లో ఇప్పుడు అది లోపించింది. నాయకులు ఎవరికి వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ.. పార్టీ పరువు రోడ్డున పడేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఎదురయినప్పుడు అధినేత చంద్రబాబు అస్సలు ఉపేక్షించేవారు కాదు . కానీ అధినేత చంద్రబాబుకే పార్టీ మీద పట్టు తగ్గిపోవడంతో ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా తయారయ్యారు. దీనంతటికీ కారణం పార్టీలో వలస నాయకుల హవా ఎక్కువ అవ్వడమే కారణం. ఇప్పుడు టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులను ఏమీ అనలేని పరిస్థితుల్లో బాబు ఉన్నాడు. వారు అడిగిన డిమాండ్లను పరిష్కరించడం తప్ప.

పార్లమెంట్లో కీలకమైన అవిశ్వాసం పై చర్చలో విప్ ఇచ్చినా పోయేది లేదని వ్యాఖ్యానించి పార్టీ పరువు మరోసారి గంగలో కలిపారు అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి . ఆయన్ను దారిలోకి తెచ్చేందుకు బాబు ఆయన కోరికలు తక్షణం తీర్చడానికి రోడ్ల విస్తరణకు 45 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో ఇచ్చి పారేశారు. గతంలోనూ సమయం చూసి తన ప్రాంతానికి నీటి విడుదలపై అలిగి మరి పనిచేయించుకున్నారు దివాకర రెడ్డి. దివాకర రెడ్డి విషయంలో ఇంతకన్నా మరో ఆప్షన్ లేదు బాబు కి.

ఇక ఇటీవల కర్నూల్ జిల్లా లో లోకేష్ పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలు లెక్కలోకి తీసుకుంటే… రాజ్యసభ టిడిపి సభ్యుడు టిజి వెంకటేష్ స్వయంగా లోకేష్ మీద ధ్వజమెత్తారు. కర్నూల్ జిల్లాలో తనను కనీసం సంప్రదించకుండా లోకేష్ టికెట్లు ఇచ్చుకుంటూ పోవడంపై టిజి హార్ట్ అయ్యి పార్టీని తన వ్యాఖ్యలతో హర్ట్ చేసి పారేశారు. ఆ వ్యవహారం సరిదిద్దుకోవడానికి స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వెంకటేష్ అధిష్టానం లో కీలక నేత భావి అధినేత లోకేష్ పైనే సీరియస్ కావడం వెనుక టిజి బడా పారిశ్రామికవేత్త కావడం కాంగ్రెస్ నుంచి వచ్చి రాజ్యసభ టికెట్ కొనుగోలు చేసుకుని ఎంపీ అయ్యాడు. ఇది అందరకి తెలిసిన విషయమే.

పార్లమెంట్ లో అవిశ్వాసం సందర్భంగా … టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా అలకబూనారు. అవిశ్వాసానికి తాను నోటిస్ ఇస్తే మాట్లాడే అవకాశం గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడికి ఇవ్వడంపై అలిగారు. మళ్ళీ బాబు రంగంలోకి దిగి ఆయనకు నచ్చచెప్పాల్సి వచ్చింది. ఇలా ప్రతి ఒక్కరూ లాగడం బాబు బుజ్జగించడం ఇప్పుడు టీడీపీలో మాములు అయిపోయింది. ఇలాంటి వ్యవహారాలు అన్ని పార్టీల్లోనూ ఉన్నా .. టీడీపీ లో మాత్రం ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి.