కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేస్తే, అష్టైశ్వర్యాలు కలుగుతాయి Devotional Bhakthi Songs Programs     2017-11-01   22:23:08  IST  Raghu V

Importance Of Karthika Pournami

కార్తీక మాసం నెల రోజుల్లో ప్రతి రోజు ప్రత్యేకమైనది. అయితే ఈ నెల రోజుల్లో కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. అంతేకాక కార్తీక పౌర్ణమి రోజు అనేక వ్రతాలు, పూజలు చేస్తూ ఉంటారు. ఈ రోజు శివ కేశవులకు ఇష్టమైన రోజు. కార్తీక పౌర్ణమి మహా శివరాత్రితో సమానం. మహా శివరాత్రి రోజు పూజలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజల వలన కూడా అంతే పుణ్యం వస్తుంది.

ఆ రోజున శివుని దగ్గర దీపాన్ని వెలిగిస్తే తెలిసి తెలియక చేసే పాపాలు అన్ని నశిస్తాయి. కార్తీకపౌర్ణమి రోజున శివునికి రుద్రాభిషేకం,విష్ణువుకి ప్రియమైన సత్యనారాయణ వ్రతం చేసిన వారికి…సకల సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణమిరోజున కేదారేశ్వరస్వామి వ్రతం చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. ఈరోజున దీప దానం చేస్తే, పుణ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. ఈ పవిత్రమైన రోజున చేసే అన్ని దానాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ ఒక్క రోజు దీపం వెలిగించడం వలన, సంవత్సరం అంతా దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది.

కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునే లేచి, తలస్నానం చేసి గుడికి వెళ్ళాలి. ఈ రోజు స్త్రీలు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో దీపారాధన చెయ్యాలి. ఆ తరవాత తులసి కోట ముందు ఒక పీట పెట్టి ముగ్గు వేయాలి. ఒక వెండి గిన్నెలో పాలు పోసి, చంద్ర కిరణాలు పడేటట్టు ఆ పీట పై పెట్టాలి. ఇంకా చంద్రునికి చలివిడి, వడపప్పు, కొబ్బరికాయ, తాంబూలం సమర్పించాలి. తులసి కోట వద్ద 365 వత్తులు వెలిగించాలి. ఇలా చేసిన తరవాత, ఆ ప్రసాదాన్ని ఫలహారంగా తీసుకోవాలి. ఇలా చేయడం వలన కడుపుకి చల్లదనం, బిడ్డలకు రక్ష అని అంటారు.