హీరోలు కావ‌లెను! క‌ర్ణాట‌క‌లో అన్ని పార్టీల కామ‌న్‌ నినాదం..     2018-05-04   00:39:30  IST  Bhanu C

హీరోలు కావ‌లెను!! అయితే, ఇదేదో సినిమాల్లో న‌టించేందుకు మాత్రం కాదు. రాజ‌కీయాల్లో ప్ర‌చారం చేసేందుకు! ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌లు అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. అధికార పీఠం కోసం ఏ పార్టీకి ఆ పార్టీ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే త‌మ ఒక్క‌రి వ‌ల్ల ప్ర‌చారం స‌రిపోద‌ని, ప్ర‌జ‌లు ఫిదా కాలేర‌ని గ్ర‌హించిన నేత‌లు.. ఇప్పుడు రాజ‌కీయ పార్టీల‌కు తోడుగా సినీ ఇండ‌స్ట్రీని కూడా రంగంలోకి దింపారు. ఈ క్ర‌మంలో శాండిల్ ఉడ్‌కి చెందిన ప్ర‌ముఖ తార‌లు రాజ‌కీయ నాయ‌కుల ప‌క్షాన పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. వీరిలో కొంద‌రు పార్టీల్లో చేరిన వారు ఉండ‌గా మ‌రికొంద‌రు మాత్రం త‌ట‌స్థంగా ఉన్నారు. ఇలా ప్ర‌చారం చేస్తున్న వారిలో ఒక‌రిద్ద‌రు ఏకంగా టైం చూసుకుని రెండు పార్టీల అభ్య‌ర్థుల‌కు కూడా ప్ర‌చారం చేస్తున్నారు.

ద‌క్షిణాదిలో అందునా క‌ర్ణాట‌క‌లో హీరోలు ఏం చెప్పినా ప్ర‌జ‌లు వెంట‌నే రిసీవ్ చేసుకుంటారు. అందుకే ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ మంది మూవీ ఆర్టిస్టులు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రాష్ట్రం క‌ర్ణాట‌కే! చాలా మంది హీరోలు, సీనియ‌ర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు కూడా ప‌లు పార్టీల్లో స‌భ్య‌త్వం క‌లిగి ఉండ‌డం విశేషం. వీరిలో చాలా మంది టికెట్లు కూడా పొంది బ‌రిలో నిలిచి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. వీరిలో ర‌మ్య శ్రీ(కాంగ్రెస్‌) త‌ర‌ఫున చాలా పెద్ద పేరు తెచ్చుకుంది. అదేవిధంగా బాగ‌ల్‌కోట్ నుంచి బ‌రిలో నిలిచిన డైలాగ్ కింగ్ సాయి కుమార్ గురించి వేరే చెప్పాల్సిన ప‌నిలేదు.బీజేపీ అభ్య‌ర్థిగా ఈయ‌న పోటీ చేస్తున్నాడు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. మ‌రో సారి ఆయ‌న‌కు బీజేపీ టికెట్ ఇచ్చిందంటే రీజ‌న్ అర్ధ‌మ‌వుతుంది.