సక్సెస్‌ కోసం పాట్లు.. నితిన్‌ పారితోషికం లేకుండానే  

యువ హీరో నితిన్‌ ఒక హిట్‌, రెండు మూడు ఫ్లాప్‌లు అంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ‘అఆ’ చిత్రం తర్వాత నితిన్‌ చేసిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో ఈ యువ హీరో దిల్‌రాజు బ్యానర్‌లో ఒక చిత్రం చేయాలని కోరుకున్నాడు. కెరీర్‌ ఆరంభంలో నితిన్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కింది. ఆ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సినిమానే దిల్‌, అదే రాజును కాస్త దిల్‌రాజుగా మార్చేసింది. అప్పటి నుండి కూడా నితిన్‌ తనతో ఒక చిత్రాన్ని నిర్మించాల్సిందిగా దిల్‌రాజును కోరుతూనే ఉన్నాడట. ఇన్నాళ్లకు శ్రీనివాస కళ్యాణం చిత్రంను నితిన్‌తో దిల్‌రాజు నిర్మించడం జరిగింది.

దిల్‌రాజు బ్యానర్‌లో నటించాలనే కోరికతో నితిన్‌ పారితోషికం విషయంలో పట్టింపులు లేకుండా ప్రవర్తించాడు. నితిన్‌ గత చిత్రం ఛల్‌ మోహన్‌ రంగ చిత్రంను నైజాం ఏరియాలో దిల్‌రాజు పంపిణీ చేయడం జరిగింది. ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో దాదాపు అయిదు కోట్ల మేరకు దిల్‌రాజు నష్టపోయాడు. దాంతో ఇప్పుడు ఆ నష్టంను పూడ్చుకునేందుకు నితిన్‌తో హీరోగా దిల్‌రాజు సినిమాను తీస్తున్నాడు. సినిమాకు నితిన్‌ పారితోషికం లేకుండానే నటించినట్లుగా తెలుస్తోంది.

ఛల్‌ మోహన్‌ రంగ చిత్రం నష్టాలను భరించాల్సిన అవసరం నితిన్‌కు లేదు. కాని దిల్‌రాజు కోసం ఆ నష్టాలను తన నెత్తిన వేసుకుని, ఈ చిత్రంలో పారితోషికం లేకుండా నటించాడు. సినిమా సక్సెస్‌ అయితే అంతో ఇంతో పారితోషికం ఇవ్వాలని దిల్‌రాజు నిర్ణయించుకున్నాడు. హీరోలను వాడేసుకోవడం, వారి వీక్‌నెస్‌లపై దెబ్బ కొట్టి వారితో ఫ్రీగా కాని, తక్కువ రెమ్యూనరేషన్‌కు సినిమాలు చేయించుకోవడం దిల్‌రాజుకు వెన్నతో పెట్టిన విధ్య.

నితిన్‌ విషయంలో కూడా అదే జరిగింది. అయితే నితిన్‌కు మాత్రం ఒక మంచి సినిమా కావాలనే కోరిక చాలా కాలంగా ఉంది, ఆ కోరిక ఈ చిత్రంతో తీరబోతుందని నితిన్‌ భావిస్తున్నాడు. ఈ చిత్రం సక్సెస్‌ అయితే ఆయనకు పారితోషికం కూడా అక్కర్లేదట. మరి పారితోషికం కూడా తీసుకోకుండా చేసిన శ్రీనివాస కళ్యాణం చిత్రం నితిన్‌కు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.