అల్లుడు గారు ఆదుకోండి మహాప్రభో..     2018-06-14   02:54:48  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన ‘కాలా’ చిత్రం తెలుగులో అట్టర్‌ ఫ్లాప్‌ అని తేలిపోయింది. తమిళంలో కాస్త పర్వాలేదు అనిపించుకున్నా కూడా, తెలుగులో మాత్రం ఈ చిత్రం దారుణమైన కలెక్షన్స్‌ను రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసిన మొత్తంలో కనీసం 15 శాతం కూడా వసూళ్లు సాధించలేదని తెలుస్తోంది. ఇంత దారుణమైన పరాజయంతో డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయమై డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత ధనుష్‌ వద్దకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాలా చిత్రానికి నిర్మాత అయిన ధనుష్‌ సినిమా విడుదలకు ముందు అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తానికి సినిమాను అమ్మేసి భారీగా లాభాలను దక్కించుకున్నాడు.

‘కాలా’ చిత్రాన్ని కేవలం 60 కోట్లతో నిర్మించిన ధనుష్‌ తెలుగు రైట్స్‌ను ఏకంగా 30 కోట్లకు అమ్మేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కనీసం 5 కోట్ల వసూళ్లు కూడా సాధించలేదు. అందుకే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత ధనుష్‌ వద్దకు వెళ్లి తమకు వచ్చిన నష్టంలో కనీసం సగ భాగం అయినా షేర్‌ చేసుకోవాలని, తమకు ఆర్థిక సాయం చేయకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటాం అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో వారు రజినీకాంత్‌తో మాట్లాడి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చారు.