కరివేపాకు వలన ఇన్ని లాభాలా!  

ఎవరైన మనల్ని పట్టించుకోకపోతే కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నారు అని అంటాం మనం. సామెత సరదాగా ఉంటుంది కాని, కూరలో కరివేపాకు తీసి పడేయ్యడం సరదా పని కాదు. ఎందుకంటే …

* కరివేపాకులో ఐరన్, ఫోలిక్ ఆసిడ్ బాగా లభిస్తాయి. ఐరన్ డెఫిషియెన్సితో బాధపడకూడదంటే కరివేపాకు చాలా అవసరం.

* జర్నల్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్ ఫర్ న్యూట్రీషన్ కథనం ప్రకారం, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులోకి తెచ్చే శక్తి కరివేపాకులో ఉంది. ఇది ఇన్సులిన్ ఆక్టివిటిని చాలా ప్రభావితం చేస్తుందట.

* కరివేపాకులో ఫైబర్ కూడా బాగా దొరుకుతుంది. పొద్దున్నే కరివేపాకు తింటే జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగం. కొవ్వు కరిగించడానికి, బరువు తగ్గడానికి కూడా కరివేపాకు సహాయపడుతుంది.

* దగ్గుతో బాధపడుతున్న వారికి కరివేపాకు ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో లభించే విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటిఆక్సిడెంట్, యాంటి ఇంఫ్లేమెటరీ లక్షణాలు ఛాతి నొప్పి, దగ్గు, జలుబుతో పోరాడతాయి.

* మొటిమలతో ఇబ్బంది పడేవారు చవకగా కరివేపాకు సహాయం తీసుకుంటే మంచిది. యాంటి-బ్యాక్టిరియా, యాంటి-ఫంగల్ లక్షణాలు ఉంటాయి కరివేపాకులో. మీ చర్మ అరోగ్యానికి కరివేపాకు చాలా మంచిది.

* కరివేపాకులోని కెంప్ఫెరాల్, యాంటిఆక్సిడెంట్స్ లివర్ అరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. మద్యం అతిగా సేవించేవారు రోజూ కరివేపాకు తింటే, కుదిరినంత సేపు లివర్ ని కాపాడుకోవచ్చు.

* జుట్టు బాగా ఎదగడానికి, బలంగా ఉండటానికి కూడా కరివేపాకు పనికివస్తుంది.