బాలకృష్ణకి ఇచ్చి నాకు ఇవ్వలేదే..చంద్రబాబుని అడిగిన గుణశేఖర్

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినోదపు పన్నుని రద్దు చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకి గ్రాస్ కలెక్షన్ లో 15% పన్ను వసూలు చేస్తారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో వినోదపు పన్ను మాఫీ కావడం వలన నైజాం & ఆంద్రప్రదేశ్ కలెక్షన్లలో 15% పెరుగుదల ఉంటుంది. మరి ఈ పన్ను మాఫీ ఎందుకు అయినట్లు? శాతకర్ణి ఒక తెలుగు రాజు కావడం వలన, తెలుగు జాతి చరిత్రను ఈ సినిమా చెప్పనుండటం వలన కదా.

కాని తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపింపజేసిన “రుద్రమదేవి” కి మాత్రం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయం మీద ఇప్పుడు స్పందించారు గుణశేఖర్.

ఒక తెలుగు మహాసామ్రాజ్ఞి జీవిత చరిత్రను “రుద్రమదేవి” గా తీస్తే తనకు కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పన్ను మినహాయింపు ఇచ్చింది. ఆంద్రప్రదేశ్ గవర్నమెంటు తన దరఖాస్తుని తిరస్కరించింది, గౌతమీపుత్ర శాతకర్ణికి రెండు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు దొరకడం మంచి విషయం, అయితే ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం తన వద్ద వసూలు చేసిన వినోదపు పన్నుని తిరిగి తనకే “ప్రోత్సాహక నగదు” రూపంలో అందజేస్తే ఓ నిర్మాతకి బాసటగా నిలిచినవారవుతారని గుణశేఖర్ చంద్రబాబు నాయుడుకి ఓ లేఖను రాసారు.