ఈ గట్టునుంటావా అరుణమ్మ ఆ గట్టుకెళ్తావా ..?     2018-06-06   23:51:51  IST  Bhanu C

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు ఉన్నగల్లా కుటుంబానికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న గల్లా ఫ్యామిలీ నుంచి జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉన్నారు. ఇక జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి.. పార్టీ మారతారన్న వార్తలు బలంగా వినిపిస్తుండడంతో ఆమె కొడుకు, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇరకాటంలో పడ్డారు. ఇప్పుడిప్పుడే టీడీపీలో నిలదొక్కుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న జయదేవ్ కు తల్లి అరుణ కుమారి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిందట.

ఇక గల్లా ఫ్యామిలీ రాజకీయ చరిత్ర చూసుకుంటే…గల్లా అరుణకుమారి జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేసారు. వైఎస్ మృతి, రాష్ట్ర విభజన లాంటి పరిణామాల నేపథ్యంలో ఆమె 2014 మార్చిలో టీడీపీలో చేరారు. మరుసటి నెల్లోనే గుంటూరు ఎంపీ సీటు తన కొడుకు జయదేవ్ కి ఇప్పించుకుని పార్లమెంట్ మెట్లు ఎక్కించారు. అంతకుముందు.. ఎమ్మార్ కుంభకోణంలో మాజీ మంత్రి హోదాలో గల్లా అరుణకుమారి అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలున్నాయి. రూ. 2.2 కోట్ల విలువైన భూముల్ని చేజిక్కించుకున్నారంటూ ఈ కేసులో ఎంపీ జయదేవ్ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.