Fidaa Movie Review

చిత్రం : ఫిదా
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
దర్శకత్వం : శేఖర్ కమ్ముల
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : శక్తి కాంత్
విడుదల తేది : జులై 14, 2017
నటీనటులు : వరుణ్ తేజ్, సాయి పల్లవి


కథలోకి వెళితే :

వరుణ్ (వరుణ్ తేజ్) అమెరికాలో డాక్టర్. పెద్ద న్యూరాలాజిస్ట్ కావడం ఇతని కల. తన అన్నకి సంబంధం చూడటంతో అమెరికా నుంచి బాన్సువాడ వస్తాడు. ఆ పెళ్ళికూతురి చెల్లే భానుమతి (సాయి పల్లవి). పక్కా పల్లెటూరి పిల్ల. చలాకీగా ఉంటుంది‌. నాన్నంటే ప్రాణం. ఎప్పటికీ తన ఊరిని, నాన్నని వదిలిపోకూడదు అనుకుంటుంది. వరుణ్ తో ప్రేమలో పడినా, ఒక కారణాంతో తన భావోద్వేగాలను దాచుకోని రిజెక్ట్ చేస్తుంది. ఆ తరువాత వీరి ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగిందో తెరమీదే చూడండి.

నటీనటులు నటన :

లుక్స్ పరంగా కొత్తగా కనిపించిన వరుణ్, ఆ కొత్తదనాన్ని తన నటనలోకి తీసుకొచ్చాడు. భానుమతి రిజెక్ట్ చేసిన తరువాత మొదలు, వరుణ్ పెర్ఫార్మన్స్ తో, తన ఎమోషన్స్ తో బాగా కనెక్ట్ అయిపోతాం. కంచె తరువాత తన కెరీర్ బెస్ట్ అనుకోవచ్చు.

సాయి పల్లవి ఎలాంటి నటో మళయాళ ప్రేమమ్ చూసిన వారికి బాగా తెలుసు. పెద్దగా మేకప్ వాడదు, మొటిమల్ని కప్పిపుచ్చుకోదు, అక్కడే తాను ఒక నటి కాని హీరోయిన్ కాదు అని అర్థమయిపోతుంది‌. చేసేది తొలి తెలుగు సినిమా. ఎవరిదో గొంతు అప్పుగా తెచ్చుకోలేదు. తెలుగు, అందులోనూ తెలంగాణ యాస‌. ఇంతకంటే ఛాలెంజింగ్ ఏముంటుంది? ఛాలెంజ్ పై నిలబడింది సాయి పల్లవి. మన ఇంటి దగ్గరే ఉండే భానుమతి తను. తన పొగరు, వెటకారం, తండ్రిపై ప్రేమ, ఊరిపై ప్రేమ .. అన్ని మనం నిజజీవితంలో చూసాం. కాదు కాదు, మనం అలా ఫీల్ అయ్యేంత నెచురల్ గా పెర్ఫార్మ్ చేసింది సాయి పల్లవి. ఇంటర్వల్ కి ముందు అక్కతో సాయి పల్లవి ఏడ్చే సన్నివేశం మీరు మర్చిపోవడానికి ఎంత ప్రయత్నిస్తారో ప్రయత్నించండి.

మిగితా నటీనటులు పేర్లు తెలియవు జనాలకి. కాని వాళ్ళు కొత్త ముఖాల్లాగా అనిపించరు. మన చూట్టూ ఉండే మనుషుల్లానే అనిపిస్తారు‌. భానుమతి అక్క, తండ్రి పాత్ర చేసిన ఇద్దరు మంచి పెర్ఫార్మన్స్ ని అందించారు.