వేసవిలో చికెన్ వేడి చేస్తుందా? ఎంతవరకు నిజం?  

చికెన్, మాంసాహారంలో ఎక్కువగా ఆరోగ్యకరమైన లాభాలే తప్ప, నష్టాలు పెద్దగా లేని అరుదైన మాంసం. చికెన్ ప్రొటీన్ ని ఇస్తుంది. ప్రొటీన్ బలాన్ని ఇస్తుంది. అందుకే బాడి బిల్డర్స్ మరో ఆలోచన లేకుండా చికెన్ మీదే ఆధారపడతారు. మరి చికెన్ వేడి చేస్తుంది అంటారు కదా? వేసవి వచ్చిందంటే చాలు చర్చలు మొదలవుతాయి. చికెన్ ఎక్కువ తినొద్దని, గుడ్లు కూడా ఈ రెండు మూడు నెలలు మానేయాలని, లేదంటే ఒంట్లో వేడి కంట్రోల్ అవదని అంటారు. మరి ఇందులో నిజమెంతా? అసలు చికెన్ నిజంగానే ఒంట్లో వేడి పెంచుతుందా? అదే నిజమైతే మరి జిమ్ చేసేవారి పరిస్థితి ఏంటి? వాళ్ళు చికెన్ తినడం మానేస్తే పనులు ఎలా జరిగేవి?

మెటాబాలిజం రేట్ అంటే ఏంటో తెలుసా? సాధారణ భాషలో చెప్పాలంటే, తిన్నది జీర్ణం అయ్యే ప్రాసెస్. ప్రోటీన్ అంత త్వరగా జీర్ణం కాదు. అలాగే అంత సులువుగా కూడా కాదు. ప్రోటీన్ ఆహారం ఎక్కువగా తీసుకుంటే, మన శరీరం అదనపు శక్తి కూడతీసుకోని, మెటబాలిజం రేట్ ని వేగవంతం చేస్తుంది‌. అలా జరిగితే తప్ప ప్రోటీన్ జీర్ణం కాదు మరి. ఈ మెటబాలిజం రేట్ పెరగటం వలన శరీరంలో వేడి పెరగటం కూడా వాస్తవమే. ఇది, చికెన్ తింటే వేడి పుడుతుంది అనే చర్చ వెనుక సైన్స్ చెప్పే సత్యం. కాబట్టి ఏదో ఊరికే వేడి అనకుండా, ఇలా సమాధానం ఇవ్వండి ఎవరైనా అడిగితే‌.