పవన్ కుల ముద్ర వేయించుకుంటున్నాడా ... ఎందుకో..  

రాజకీయం గా ఒక పార్టీ మనుగడ సాధించాలంటే సామజిక వర్గాల మద్దతు చాలా అవసరం. కుల సపోర్ట్ లేకుండా ఏ పార్టీ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు. దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. కొత్తగా పుట్టుకొచ్చిన జనసేన పార్టీ కూడా మొదట కుల ముద్ర వేసుకునేందుకు ఒప్పుకోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కులం అండ తప్పనిసరిగా ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్ మైండ్ లో బలంగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నాడు. అందుకే జాగ్రత్తగా కుల ఓట్లను సంపాదించే పనిలో పడ్డాడు పవన్.

ముఖ్యంగా ఆయన సామాజిక వర్గమైన కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై పూర్తిస్తాయిలో పట్టు సాధించాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. అందుకే ఆ సామజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ముందుగా బలం పుంజుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం పార్టీని ప్రజల్లోకి తీసుకుళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పవన్.. తెరవెనుక కాపు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డాడు.
రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తానని ప్రకటించినప్పటికీ.. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ రాజకీయం మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదే ఉంది.

ఏపీలోని కొన్ని నియోజకవర్గాల విషయంలోనే పవన్ కళ్యాణ్ కసరత్తు కొనసాగుతోంది. ఆ నియోజకవర్గాలు ఏవంటే కాపుల జనాభా గణనీయంగా ఉన్న సీట్లు. ముఖ్యంగా గోదావరి జిల్లాలపై పవన్ పూర్తిస్థాయిలో దృష్టిసారించాడని సన్నిహితులు చెబుతున్నారు. ఈ జిల్లాలో కాపు సామాజికవర్గం ఓట్లు అధికం. అంతేగాక ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధిస్తే రాజకీయంగానూ కీలకంగా మారే అవకాశం ఉంది. అందుకే ముందుగా గోదావరి జిల్లాలపై పవన్ దృష్టిపెట్టినట్లు తెలు స్తోంది. దీంతో పాటు రాయలసీమ లోని అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టు పెంచుకునే పనిలో పవన్ ఉన్నాడు.

. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పార్టీలోకి చేరికలకు పచ్చజెండా కూడా ఊపుతున్నారు. ఈ చేరికలు ఎక్కడ జరుగుతున్నాయి? ఎలాంటి వారు చేరుతున్నారు? అనే అంశాన్ని పరిశీలిస్తే.. కాపుల జనాభా గణనీయంగా ఉన్న సీట్లలో ఆ సామాజిక వర్గం వారు ఎక్కువగా పార్టీలో చేరుతున్నారు. కాపు పార్టీ అనే ముద్రను వేయించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఏ మాత్రం వెనుకాడటం లేదని అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి.