ఊరించి ఉసూరుమనిపించాడు.. బెదిరించారా?     2018-05-18   01:13:33  IST  Raghu V

గత మూడు నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో ఉదయ్‌ కిరణ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు తేజ ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆ సినిమా కోసం టైటిల్‌గా ‘కాబోయే అల్లుడు’ అంటూ టైటిల్‌ను కూడా రిజిస్ట్రర్‌ చేయించాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఎన్టీఆర్‌ సినిమా నుండి తప్పుకున్న తేజకు ఏ హీరో కూడా ఛాన్స్‌ ఇవ్వడం లేదు. దాంతో ఆయన అంతా కొత్తవారితో ఉదయ్‌ కిరణ్‌ జీవిత చరిత్రను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే మీడియాలో వచ్చిన వార్తలను దర్శకుడు తేజ కొట్టి పారేశాడు.

మీడియాలో వస్తున్నట్లుగా తాను ఉదయ్‌ కిరణ్‌ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించడం లేదని, అంతా కొత్త వారితో ఒక సినిమాను ప్లాన్‌ చేస్తున్న మాట వాస్తవమే కాని ఉదయ్‌ కిరణ్‌ కథ కాదని తేజ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దాంతో పాటు కాబోయే అల్లుడు టైటిల్‌ గురించి కూడా స్పందించాడు. ఆ టైటిల్‌ గురించి తనకు తెలియదు అని, ఆ టైటిల్‌తో తాను సినిమా చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి తేజ మాటలతో ఆయన ఉదయ్‌ కిరణ్‌ జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోవడం లేదని వెళ్లడైంది.