చైతూ కోసం మారుతి ఫస్ట్‌టైం...     2018-05-31   00:19:21  IST  Raghu V

చిన్న చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయిన మారుతి మెల్ల మెల్లగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. ‘భలే భలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’ చిత్రాలతో దర్శకుడిగా వరుస విజయాలను దక్కించుకున్న మారుతి ప్రస్తుతం నాగచైతన్యతో ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ కారణంగానే దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తన మార్క్‌ను దాటి మరో అడుగు ముందుకు వేసి సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఇప్పటి వరకు మారుతి దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా 15 కోట్ల లోపు బడ్జెట్‌తోనే రూపొందాయి. కాని మొదటి సారి నాగచైతన్య సినిమా కోసం 20 కోట్లకు మించి ఖర్చు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. నాగచైతన్య కెరీర్‌లో కూడా ఇది ఎక్కువ బడ్జెట్‌ చిత్రంగా నిలువబోతుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ పాటను ఏకంగా 1.2 కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.