సక్సెస్‌ దక్కినా పరువు పోయింది     2018-05-30   23:49:07  IST  Raghu V

యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌ తెలుగులో టాప్‌ హీరోల్లో ఒక్కడు. గతంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో రాజశేఖర్‌ ఢీ కొట్టేవాడు అంటే ఎంతటి క్రేజ్‌ ఆయనకు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన డైలాగ్స్‌ను సొంతంగా చెప్పుకోలేక పోయినా, డబ్బింగ్‌ వేరే వారితో చెప్పించుకున్నా కూడా రాజశేఖర్‌ అద్బుతమైన నటనతో మెప్పించేవాడు. కాని ప్రస్తుతం పరిస్థితి మారింది. ‘గరుడవేగ’ చిత్రానికి ముందు రాజశేఖర్‌ దాదాపు దశాబ్ద కాలంగా సక్సెస్‌ లేక ఢీలా పడిపోయాడు. రాజశేఖర్‌ ఇక హీరోగా పనికి రాడు అని భావిస్తున్న సమయంలో గరుడవేగ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఆ సినిమా మళ్లీ ఈయనకు జీవం పోసింది.

‘గరుడవేగ’ చిత్రం సక్సెస్‌ అయిన నేపథ్యంలో వరుసగా సినిమాలు చేయాలని భావించిన రాజశేఖర్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ఒక భారీ చిత్రాన్ని రాజశేఖర్‌తో తెరకెక్కించాలని భావించాడు. అందుకోసం చర్చలు కూడా జరిగాయి. ఆ కారణంగానే రాజశేఖర్‌ తన ఇతర సినిమాలను కాదనుకున్నాడు. ధనుష్‌ దర్శకత్వంలో మూవీ అంటే ఖచ్చితంగా ఒక మంచి సినిమా అవుతుందని, తనకు మరో మంచి విజయాన్ని ఈ చిత్రం అందిస్తుందని రాజశేఖర్‌ భావించాడు. కాని అనూహ్యంగా రాజశేఖర్‌ను తన సినిమా నుండి ధనుష్‌ తప్పించాడు. రాజశేఖర్‌కు టాలీవుడ్‌లో అంత క్రేజ్‌ లేదు. తన మొదటి తెలుగు సినిమాను రాజశేఖర్‌ వంటి సాదారణ హీరోతో చేయడం కంటే నాగార్జున వంటి స్టార్‌ హీరోతో చేయడం మంచిదని ధనుష్‌ నిర్ణయించుకున్నాడు.