ఆ తప్పులు సంగతి సరే ఇప్పుడు ఏమి చేద్దాం ! చెప్పు జనసేనాని ..?  

రాజకీయాల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సరైన అవగాహన ఉందొ లేదో అన్న అనుమానం కలుగుతోంది. ప్రతి ఉద్యమంలోనూ తాను పాల్గొన్నట్టు.. ప్రతిదీ తన మనసు కలిచివేసింది అని చెప్పడం, ప్రాణాలైనా ఇస్తాను అంటూ భారీ డైలాగులు చెప్పడం ఇంతవరకు బాగానే రక్తి కట్టిస్తున్నాడు . కానీ వాస్తవ పరిస్థితిలోకి వచ్చేటప్పటికి ఆయన ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రిగా ఫీలవుతున్న పవన్.. అందుకు తగ్గ అడుగులు వేయటం మానేసి.. అర్థం పర్ధం లేని విమర్శలు చేస్తూ ప్రజల్లో చులకనవుతున్నాడు.

ఏపీకి ప్రత్యేక గోదా కోసం మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగకుండా పోరాడుతూ వస్తోంది. దాని కోసమే ఇటీవల వైసీపీ ఎంపీలు రాజీనామా కూడా చేసి ఆమోదింపజేసుకున్నారు. ఆ పార్టీ అనేక ఉద్యమాలు, ఆందోళనలు అనేకం చేసింది. ఆ క్రెడిట్ వైసీపీ ఖాతాలోకి భారీగా వస్తుండడంతో అధికార పార్టీ టీడీపీ కూడా యూ టర్న్ తీసుకుని ఇప్పుడు హోదా మీద గళం ఎత్తింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడిన వారిలో ఎంపీ గల్లా జయదేవ్.. రామ్మోహన్ నాయుడులు చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీ సమస్యలపై వారి ప్రసంగాలు జాతీయ స్థాయిలో విభజన కారణంగా ఏపీకి ఎదురైన కష్టాలు తెలిసేలా చేశాయి.

కానీ ఇప్పుడు పవన్ మీదే అందరి కళ్ళు పడ్డాయి. ఆయన విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది ఎందుకంటే.. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి.. నేనే స్వయంగా ఢిల్లీకి వచ్చి జాతీయ పార్టీ నేతలతో మాట్లాడతానని పవన్ అప్పట్లో చెప్పాడు. అయితే.. అవిశ్వాసం సందర్భంగా పవన్ కనిపించిందే లేదు. అవిశ్వాస తీర్మానం వీగిపోయాక టీడీపీపై విమర్శలు సంధిస్తున్న పవన్ కల్యాణ్.. ఎంపీ జయదేవ్ ప్రసంగం పేలవంగా ఉందంటూ ట్వీట్ చేసి మరింతగా విమర్శలపాలయ్యాడు.

నిత్యం ఏదో ఒక తప్పు వెతికే కన్నా హోదా సాధనకు ఏమేం చేయాలన్న సలహాలు సూచనలు ఆయా పార్టీలకు ఇచ్చి ఉంటే బాగుండేది. అవసరమైన సమయంలో కనిపించకుండాపోయి ఇప్పుడు వచ్చి అలా చేసి ఉండకూడదు.. ఇలా చేసి ఉండకూడదు అని చెప్పడం వాళ్ళ కలిసొచ్చే ప్రయోజనం ఏమి ఉంటుందో పవన్ చెప్పాలి. హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయండి అందరం కలిసి కేంద్రం మీద యుద్ధం చేద్దాం అప్పుడు హోదా ఎందుకు రాదో చూద్దాం అంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పడం ప్రజల్లోకి వెళ్ళింది. ఆ విధంగానే పవన్ కూడా హోదా కోసం అన్ని పార్టీలతో కలిసి ముందుకు వెళదాం అని చెప్పలేకపోయాడు.