కలిసి పోరాడితేనే దక్కును ఫలితం     2018-06-17   00:14:54  IST  Bhanu C

కలిసి ఉంటే కలదు సుఖం, కలదు లాభం అనే సామెత తెలుగులో బాగా ఫేమస్‌. అలాగే కలిసి పోరాడితేనే ఏదైనా సాధ్యం అనే విషయం కూడా అందరు తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సామెతను గుర్తించాల్సిందిగా సామాన్య ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా కేంద్రంపై చిన్న స్థాయి యుద్దం చేస్తున్నారు. అయితే విడి విడిగా ఆ యుద్దం సాగుతున్న కారణంగా ఇద్దరికి కూడా ఫలితం దక్కడం లేదు. అందుకే ఇద్దరు కలిసి పోరాడితే తప్పకుండా ఫలితం ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలను నెరవేర్చాలంటూ తెలుగు దేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం వద్ద ఆందోళన సాగిస్తున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీ ప్రస్తుతం బయటకు వచ్చి మరీ ఉద్యమం చేస్తుంది. ఇక మరో వైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఒక కూటమినే ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న కేసీఆర్‌ తాజాగా మోడీతో భేటీ అయిన విషయం తెల్సిందే.