శూర్పణక కాజల్‌ గురించి క్లీయర్‌గా.. సంచలన ప్రాజెక్ట్‌     2018-07-06   02:11:10  IST  Raghu V

రామాయణంలో శూర్పణక పాత్రకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామాయణంలో రామ, రావణ యుద్దం జరగడానికి ముఖ్య కారణం శూర్పణక అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. రాముడిపై మోజు పడ్డ శూర్పణక ముక్కు చెవులు కోస్తాడు లక్ష్మణుడు. ఆ కోపంతో తన అన్న రావణుడి వద్దకు వెళ్లి సీతను నీ కోసం తీసుకు వచ్చేందుకు వెళ్లగా తనకు ఈ అవమానం చేశారు అంటూ అబద్దం చెబుతుంది. అలా రాముడి భార్య అయిన సీత దేవిని వ్యామోహంతో రావణుడు దక్కించుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఎప్పుడైతే రావణుడికి ఆ విధమైన ఆలోచన వచ్చిందో అప్పుడే అతడి జీవితం నాశనంకు అడుగులు పడ్డాయని చెప్పుకోవచ్చు.

శూర్పణక వల్ల జరిగిన రామాయణం ప్రస్తుతం హిందువుల ఆరాధ్య గ్రంథం. రామాయణ మహాగ్రంథంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. తెలుగులో కూడా పలు సినిమాలను ప్రేక్షకుల ముందుకు మేకర్స్‌ తీసుకు రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు శూర్పణక పాత్రను బేస్‌ చేసుకుని సినిమాలు వచ్చింది లేదు. అందుకే ఇప్పుడు శూర్పణక పాత్రను బేస్‌ చేసుకుని, అది కూడా సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కించేందుకు భార్గవ్‌ అనే దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగుతో పాటు సౌత్‌ భాషలన్నింటిలో మరియు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అతడు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుతున్న దర్శకుడు స్టోరీ లైన్‌ను కాజల్‌కు వినిపించాడు. శూర్పణకగా కాజల్‌ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అల్ట్రా మోడ్రన్‌ అమ్మాయిగా కాజల్‌ కనిపించడంతో పాటు, రామాయణ కాలం శూర్పణకగా కూడా కాజల్‌ కనిపించబోతుంది. ఈ కాలంకు రామాయణ కాలంకు దర్శకుడు ఒక లింక్‌ను క్రియేట్‌ చేయబోతున్నాడు. ఆ లింక్‌ ఏంటీ? అసలు ఈ కాలంలో శూర్పణకలు అంటే ఎవరు అంటూ ఈ చిత్రంలో దర్శకుడు చూపించేందుకు స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రంను 75 కోట్ల బడ్జెట్‌తో రూపొందించేందుకు దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.

హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు 75 కోట్లు అంటే చాలా చాలా ఎక్కువ. అయినా కూడా సినిమాపై నమ్మకంతో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రంను నిర్మించేందుకు ముందుకు వచ్చింది. త్వరలోనే పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ను సిద్దం చేసి, ఈ సంవత్సరం చివర్లో సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లడంతో పాటు 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా దర్శకుడు భార్గవ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. స్టోరీలైన్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సినిమాతో భారీ వసూళ్లను నమోదు చేస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది.