వైసీపీకి సినీ గ్లామర్ పెరగబోతోంది ..? వారంతా ప్రజాసేవ చేసేస్తారట !     2018-06-27   00:29:46  IST  Bhanu C

తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది అనే సామెత ఎందుకు వచ్చిందో కానీ ఇప్పడు రాజకీయాల్లో కి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సినీ జనాలను చూస్తే అదే నిజమనిపిస్తోంది. సినీ ఫీల్డ్ లో మంచి పొజిషన్ కి వెళ్లి ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న కొంతమంది ప్రముఖులు రాజకీయాల్లోకి చేరి ప్రజా సేవ చేసేందుకు ఉర్రుళ్ళు ఊగుతున్నారు. రాజకీయ నాయకులతో సినిమా ఫీల్డ్ వారికి ఎప్పుడూ మంచి ఫ్రెండ్ షిప్ ఉంటుంది. దీన్నే అవకాశంగా తీసుకుని కొంతమంది రాజకీయ అరంగ్రేటం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

గతంలో టీడీపీలో సినీ జనాల సందడి ఎక్కువగా ఉండేది. అయితే ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా వైసీపీ లో చేరి టికెట్ సంపాదించాలని ఆశించే సినీ ప్రముఖుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. గీతాంజలి, లక్కున్నోడు సినిమాలు తీసి, ప్రస్తుతం ఆది-తాప్సీలతో ఓ సినిమా, గీతాంజలి 2 అంటూ మరో సినిమా నిర్మిస్తున్న ఎంవివి సత్యనారాయణ వైకాపా తీర్థం తీసుకున్నారు.

విశాఖలో బడా బిల్డర్ గా ఉన్న ఆయన అక్కడి ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ మధ్యనే వైకాపాలో చేరారు. ఆయనకు ఇప్పుడు ఏకంగా నియోజక వర్గ సమన్యయ కమిటీ చైర్మన్ పదవిని కూడా పార్టీ అందించింది. అలాగే .. తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా వర్తమాన రాజకీయాలపై సదా అలెర్ట్ గా వుండే హీరో నిఖిల్ కు కూడా పరోక్షంగా వైసీపీబంధాలు అలుముకున్నాయి. నిఖిల్ స్వంత బావ తండ్రి అయినా ఆర్ కొండయ్య కూడా వైకాపాలో చేరారు. ఆయన ప్రకాశం జిల్లాలోని ఓ నియోజక వర్గం నుంచి పోటీకి రెడీ అవుతున్నారు.