Chiranjeevi’s failure costed unemployment for 80 people

ఓ సంస్థ నష్టాల్లోకి వెళితే నష్టపోయేది కేవలం ఆ సంస్థ మాత్రమే కాదు. అందులో పనిచేసేవారు కూడా నష్టపోతారు. యజమానులు డబ్బు నష్టపోతే, ఉద్యోగస్తులు ఉపాధిని నష్టపోతారు. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ నష్టాల్లోనే ఉంది. ఎప్పటినుంచైతే మాకి స్టార్ జతకలిసి అది “స్టార్ మా” గా మారిందో, అప్పటినుంచి ఆ ఛానెల్ కి ఏమి కలిసిరావడం లేదు. ముఖ్యంగా ఆ ఛానెల్ మర్చిపోలేని పీడకల “మీలో ఎవరు కోటీశ్వరుడు”.

రేంజ్ పెంచుదామని నాగార్జున స్థానంలో మెగా స్టార్ చిరంజీవిని తీసుకొచ్చారు. బాగా ఖర్చుపెట్టారు. పారితోషికం కూడా భారీగానే అప్పజెప్పారు. కాని ఏమైంది ? పండక్కి అంచనాలతో వచ్చిన పెద్ద హీరో సినిమా విషయం లేక బోల్తాపడ్డట్టు, మీలో ఎవరు కోటీశ్వరుడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రేక్షకులకి ఈ షో అంటే బోర్ కొట్టిందో లేక మెగాస్టార్ హోస్ట్ చేసే పద్ధతి నచ్చలేదో, అతి దారుణమైన టీఆర్పీ కట్టబెట్టారు.

ఈ షో నష్టాల దుఃఖం తీరకముందే భారీ రేట్లు పెట్టి కొన్న ఖైదీనం 150, గౌతమీపుత్ర శాతకర్ణీ, రెండూ టీవి దగ్గర తుస్సుమన్నాయి. మరీ ముఖ్యంగా ఖైదీ నం 150 ఇచ్చిన షాక్ చిన్నది కాదు. జెమిని, ఈటీవి ధాటికి తట్టుకోలేని స్టార్ మా ఏం చేసిందో తెలుసా? ఏకంగా 80 మంది ఉద్యోగస్తులని ఒకేసారి తీసేసింది. అందులో చాలామంది సీనియర్ ఉద్యోగస్తులు కావడం విడ్డూరం. వారికి ఎలాగో కొంత డబ్బు అందుతుంది కాని, మళ్ళీ ఉద్యోగాల వేట మొదలుపెట్టాల్సిన దుస్థితి. ఈ పరిస్థితికి ఓరకంగా మెగాస్టార్ వైఫల్యం కూడా కారణం.

మరి ఎన్టీఆర్ బిగ్ బాస్ తో ఏం చేస్తాడో. ఈ షో మీద కూడా భారీగానే ఖర్చుపెడుతున్నారు. ఎన్టీఆర్ భారీ పారితోషికం కలుపుకోని ఏకంగా 50 కోట్ల బడ్జెట్ వేసారట. మరి మెగాస్టార్ తీసుకొచ్చిన కష్టాలు యంగ్ టైగర్‌ సహాయంతో తీరుతాయో లేదో చూడాలి.