ప‌థ‌కాల‌పై సంతృప్తి ఎవ‌రికి.. బాబుకా.. ప్ర‌జ‌ల‌కా..?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ వేదిక ఎక్కినా చెబుతున్న ఏకైక మాట‌.. ప్ర‌జ‌లు ఎంతో సంతృప్తితో ఉన్నార‌ని! తాను ప్ర‌వేశ పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు ఇప్ప‌టికే దాదాపు 80% సంతృప్తితో ఉన్నార‌ని ఆయ‌న అంటున్నారు. ఈ విష‌యాన్ని అటు వీడియో కాన్ఫ‌రెన్సులు, స‌ద‌స్సులు, బ‌హిరంగ స‌మావేశాల్లోనూ ఆయ‌న చెబుతున్నారు. మ‌రి సంతృప్తి ఈ రేంజ్‌లో ఉంటే.. అటు వైసీపీ అధినేత జ‌గ‌న్ కానీ, జ‌న‌సేనాని ప‌వ‌న్ కానీ పెడుతున్న స‌భ‌ల‌కు, నిర్వ‌హిస్తునన్న స‌మావేశాల‌కు ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఎందుకు వెళ్తున్నారు? వారు త‌మ క‌ష్టాల‌ను ఎందుకు వెళ్ల‌బోసుకుంటున్నారు? త‌మకు ప్ర‌భుత్వం నుంచి క‌నీస సౌక‌ర్యాలు కూడా అంద‌డం లేద‌ని క‌న్నీటి ప‌ర్యంతం ఎందుకు అవుతున్నారు? ఇలాంటి అనేక ప్రశ్న‌ల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేవి ప‌రిశీల‌కుల మాట‌.

రాష్ట్రంలో అధికారం చేప‌ట్టిన త‌ర్వాత గ‌తంలో లేని విధంగా చంద్ర‌బాబు.. ప్ర‌తి విష‌యంలోనూ స‌ర్వేల‌నే న‌మ్ముతున్నారు. త‌న సొంత పార్టీ టీడీపీలో నేత‌ల ప‌రిస్థితి నుంచి ఎమ్మెల్యేలు, అధికారుల ప‌నితీరు,ప్ర‌జ‌ల సంతృప్తి వంటి కీల‌క విష‌యాల‌ను కూడా ఆయ‌న స‌ర్వేల ద్వారానే తెలుసుకుంటు న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న సంక్షేమ ప‌థ‌కాల ద్వారా రాష్ట్రంలో 80% మంది ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నార‌ని, ఇది దేశంలోనే తొలి ప్లేస్ అని అధికారులు వెల్ల‌డించారు. దీనిని చంద్ర‌బాబు స్వ‌యంగా ప‌లు స‌భ‌ల్లో వెల్ల‌డించారు. నిజానికి ఇప్ప‌టికీ త‌మ కు పింఛ‌న్ అంద‌లేద‌ని చెబుతున్న అనేక మంది వృద్ధులు, వితంతువులు రాజ‌ధాని న‌గ‌రం విజ‌య‌వాడ‌, గుంటూరుల్లోనే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. అది కూడా ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌ల్లో ప్ర‌త్యేక క‌థ‌నాలు గా వ‌చ్చాయి. అదేవిధంగా ఈపోస్ యంత్రాల‌తో తిప్ప‌లు ప‌డుతున్నామ‌ని, స‌రుకులు స‌రిగా అంద‌డం లేద‌ని చెబుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి.