లాభం లేదు 'బాబు' జేసి బ్రదర్స్ ని ఏదో ఒకటి చేయాల్సిందే     2018-09-11   12:24:31  IST  Sai M

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే టీడీపీ లో ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పింది. వలస నాయకులు ఈ మధ్యకాలంలో పార్టీలో ఎక్కువ చేరడంతో … ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ… ఎవరిని లెక్కచేసే పరిస్థితిలో లేకుండా పూర్తిగా అదుపు తప్పారు. ఈ కోవలో అందరికంటే.. ముందువరసలో ఉన్నారు అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్. రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ తీరే వేరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం .. ఎవరిని లెక్కచేయకపోవడం.. ఏ విషయాన్నైనా కుండబద్దలకొట్టినట్టు చెప్పడం ఈ జేసీ బ్రదర్స్ నైజం. వీరిని అదుపు చెయ్యడంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఈ బ్రదర్స్ కి ఎదురువెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో బాబు కి బాగా తెలుసు.

Ap Politics Updates,Chandrababu Naidu,Chandrababu Naidu You Should Take Action On JC Brothers,Jc Brothers,TDP

ఈ బ్రదర్స్ వ్యవహారం మరీ మితిమీరిపోవడంతో… సొంత పార్టీ నేతలు కూడా వీరి వ్యవహారశైలి వల్ల నష్టపోతుండడంతో టీడీపీ నాయకులు అంతా వారిపై గుర్రుగా ఉన్నారు. జేసీ బ్రదర్స్ ను కట్టడి చేయకుంటే జిల్లాలో తాము పనిచేసుకోలేమని, పార్టీ కూడా నవ్వుల పాలవుతుందని చంద్రబాబుకు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లోనే జేసీ బ్రదర్స్ విషయంలో తాడో పేడో తేల్చేయాలని ఆ జిల్లా నేతలు కంకణం కట్టుకున్నారు.

జేసీ బ్రదర్స్ వల్ల నియోజకవర్గాల్లో తాము అప్రతిష్ట పాలవుతున్నామని, పార్టీ పరువు కూడా బజారున పడుతుందని వారు బహిరంగంగానే శాసనసభ లాబీల్లో జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్యెల్యేలు చెబుతుండటం విశేషం. జేసీ బ్రదర్స్ ను ఇలాగే వదిలేస్తే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా చేయి దాటి పోయే ప్రమాదముందని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మంత్రి కూడా ఆందోళన చెందుతున్నట్టు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.

Ap Politics Updates,Chandrababu Naidu,Chandrababu Naidu You Should Take Action On JC Brothers,Jc Brothers,TDP

జేసీ బ్రదర్స్ ఏ నియోజకవర్గాల్లో ఎప్పుడు? ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? వారు ఉపయోగించిన భాష, టీడీపీ ఎమ్మెల్యేల పైన చేసిన ఆరోపణలను పత్రికా క్లిప్పింగ్ లతో పాటు వీడియోలను కూడా వీరు సిద్ధం చేసుకున్నారు ఆ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్యెల్యేలు. జేసీ బ్రదర్స్ వైఖరిపై ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, పల్లె రఘునాధరెడ్డి, యామిని బాల, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత వంటి వారు ఆగ్రహంతో ఉన్నారు. వీరు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి జేసీ బ్రదర్స్ వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని లేకపోతే టీడీపీకి ఈ జిల్లాలో ఆదరణ తగ్గడం ఖాయం అని వారంతా ముక్తకంఠంతో చెప్తున్నారు.