టీడీపీ లో ఆ 'ముదుర్లు' కు మూడిందా  

రాబోయే ఎన్నికల్లో టీడీపీ కి కొత్త రక్తం ఎక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ సేవలో మూలిగి ఉన్న సీనియర్ నాయకులకు రిటైర్మెంట్ ప్రకటించి యువ నాయకులకు అవకాశం ఇస్తే పార్టీకి తిరుగుండదని, వారు లోకేష్ కు కూడా అండదండగా ఉంటారని చంద్రబాబు నాయుడు ప్లాన్ వేస్తున్నాడు. ఈ విధంగా ఇప్పటివరకు పదిమంది నేతల లిస్ట్ తయారయ్యిందట. వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని అవసరమైతే వారి సేవలు పార్టీకి ఉపయోగపడేలా అవకాశం కల్పిద్దామని టీడీపీ అధినేత ఆలోచన. అయితే ఈ రిటైర్మెంట్ తీసుకుంటున్న నేతల స్థానంలో వారి వారసులకు అవకాశం కల్పించే ఆలోచనలో ఉన్నారు.

జిల్లాల వారీగా నేతల లిస్ట్ ఒక్కసారి పరిశీలిస్తే.. తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ నేత, మంత్రి యనమల రామకృష్ణుడు, కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి, చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు, అనంతపురం జిల్లాలో జేసీ సోదరులు దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హనుమంతరాయ చౌదరి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. అయితే, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మరింత మంది నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్దానంలో బొజ్జల సుధీర్ రెడ్డి , విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజు వచ్చేసారి తన కూతురును రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జెసి ప్రభాకర్ రెడ్డి తప్పుకుంటున్నారు. ఇక, జెసి దివాకర్ రెడ్డి కూడా రాజకీయాల నుండి తప్పుకుంటున్నారు. వాళ్ళిద్దరూ తమ వారసులను తాడిపత్రి ఎంఎల్ఏ, అనంతపురం ఎంపిగా పోటీ చేయటానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన హనుమంతరాయ చౌదరి కూడా వయస్సు రీత్యా రాజకీయాల నుండి తప్పుకుంటున్నారు. తన స్ధానంలో కొడుకు మారుతికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సీనియర్లు తప్పుకోవడానికి ఒప్పుకున్నా చంద్రబాబు వారి వారసుల విషయంలో ఇంకా స్ప్రష్టమైన క్లారిటీ ఇవ్వలేదట. సర్వేల ఫలితాల ఆధారంగా హామీ ఇచ్చేందుకు బాబు తన నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టాడు.