కాంగ్రెస్ కి సహకారం ... టీడీపీకి ఉపకారం ! ఇదే బాబు స్కెచ్  

ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏపీలో కొంచెం కొంచెం బలం పెంచుకుంటోంది. ఆ బలానికి కావాల్సిన మందుల్ని టీడీపీ అధినేత బాబు సరఫరా చేస్తున్నాడు అనేది అందరికి తెలిసిందే. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టి ఆ పార్టీకి వచ్చే కొద్దిపాటి ఓట్లను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు బాబు ప్రయత్నం చేస్తున్నాడు. అలా కాకపోయినా కాంగ్రెస్ బలం పెంచుకుంటే వైసీపీకి రావాల్సిన ఓట్లను చీల్చుతుంది . ఈ రెండు ఆప్షన్ లో ఏదైనా బాబు కి కలిసి వస్తుంది కనుక కాంగ్రెస్ బలపడేలా బాబు ప్రయత్నాలు చేస్తున్నాడు.

వైకాంగ్రెస్ లోకి కిరణ్ కుమార్ రావడం వెనుక బాబు హస్తం ఉంది. అదీ వరసపెట్టి కాంగ్రెస్‌ పాత నేతలను పిలిచి మాట్లాడిస్తూ ఉండటం, వారి ‘వ్యక్తిగత’ సమస్యలు ఏవో తెలుసుకుని పరిష్కరిస్తూ ఉండటం ఆసక్తిదాయకంగా మారింది. ఈ విషయాన్ని ఇటీవల చంద్రబాబును కలిసిన ఒక కాంగ్రెస్‌నేత సూటిగానే చెప్పాడు. చంద్రబాబుకు తన వ్యక్తిగత సమస్యలను కొన్ని చెప్పుకున్నాను అని వాటిని పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చాడని ఆ కాంగ్రెస్‌ నేత చెబుతున్నాడు.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గం డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ను ఇచ్చేందుకు బాబు ఇష్టపడడంలేదు. తన పార్టీలోని ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిల చేతుల్లో ఆ నిధులు పెట్టి ఖర్చు పెట్టిస్తున్నారు చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్‌లోని వారిని రప్పించి, వారి వ్యక్తిగత సమస్యలేమిటో అడిగి పరిష్కరిస్తున్నాడంటే దీనివెనుక పెద్ద స్కెచ్చే ఉందని స్పష్టం అవుతోంది. అందులోనూ ఆ కాంగ్రెస్‌ నేతలు ఇన్నాళ్లూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినవారే.

కాంగ్రెస్‌ బలోపేతం అయితే జగన్‌ ఓట్లు చీలుతాయి అనేది చంద్రబాబు ఎత్తుగడ. అందుకోసం కాంగ్రెస్‌పార్టీ నేతలకు సహకరించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు సాగిస్తున్నాడని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక అనే అంశం మీద ఆశలు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. తన మీద వ్యతిరేకతే లేదని పైకి చెప్పుకొంటూ చంద్రబాబు ఇలాంటి ఎత్తుగడలను అమల్లో పెడుతున్నాడు. ఇక ఏపీ కాంగ్రెస్ నేతలకు కూడా బాబు డైరెక్షన్ లో వెళ్లాల్సిందిగా అంతర్గతంగా ఆదేశాలు అందినట్టు కనిపిస్తున్నాయి.