బాబుకి తలనొప్పిగా మారిన సిట్టింగ్ ఎమ్యెల్యేల సీటు     2018-07-01   00:53:33  IST  Bhanu C

ఏపీ అధికార పార్టీలో ఎన్నికల టెన్షన్ బాగా పెరిగిపోయింది. ఒక పక్క పవన్ మరోపక్క జగన్ పక్కలో బల్లెంలా మారడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధం అవ్వాల్సి రావడంతో అధికార పార్టీ బాగా ఒత్తిడికి గురవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని కసిగా ఉన్న బాబుకు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్యెల్యేలు పెద్ద మైనెస్ గా మారారు. ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్యెల్యేలు చాలామంది వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదని సర్వేలు కుండబద్దలగొట్టినట్టు తేల్చేయడంతో ఈ సారి గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించాలని బాబు ఆలోచన చేస్తున్నాడు.

ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇచ్చేది లేదని .. కొత్తవాళ్లకు కావాలంటే టికెట్లు ఇవ్వడానికి కూడా తను వెనుకాడను అని కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరగబోతోందని.. చాలామంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వచ్చేసారి టికెట్లు దక్కే అవకాశం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రత్యేకించి అధికార పార్టీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉండటం అంటే అంతకు మించిన అవకాశం మరొకటి లేదు. వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవచ్చు. పార్టీకి మంచిపేరు తెచ్చి పెట్టవచ్చు. మరోసారి గెలుపుకు బాటలు వేసుకోవచ్చు. అయితే ఎన్నికలయ్యాకా నాలుగేళ్లకు, ఎన్నికలు మళ్లీ దగ్గరపడుతున్న వేళ టీడీపీ సిట్టింగులు మాత్రం బాగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని స్పష్టం అవుతోంది.