బాబుకు పెద్ద త‌ల‌పోటు ఈ పంచాయ‌తీ... ప‌రిష్కారం కాదా...!     2018-05-09   01:05:02  IST  Bhanu C

రాష్ట్ర మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి దూకుడు బ్రేక్ ప‌డాల్సిందేన‌ని టీడీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. క‌డ‌ప జిల్లాకు చెందిన ఆది .. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి గెలుపొందారు. అయితే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రంతో ఆయ‌న వైసీపీ నుంచి జంప్ చేసి టీడీపీలోకి వ‌చ్చాడు. ఇలా వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న‌కు బాబు మంత్రి ప‌ద‌వి ఇచ్చాడు. అయితే, ఆది మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత నుంచి వివాదాస్ప‌దంగానే వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నాడు. ఎస్సీల‌కు శుభ్ర‌త తెలియ‌ద‌ని, వారివి మురికి మొహాల‌ని అని తీవ్ర వివాదం సృష్టించాడు. దీనిని స‌ర్దు బాటు చేయ‌డం నేత‌ల వ‌ల్ల‌కాలేదు. ఇక‌, ఇప్ప‌డు ఆయ‌న టీడీపీలోనే చిచ్చు పెడుతున్నాడు. త‌న దుందుడుకు మాట‌ల‌తో నేత‌ల మ‌ధ్య విభేదాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాడు.

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం టికెట్ త‌న‌దేన‌ని పేర్కొంటూ వివాదం సృష్టించాడు. ఇది మ‌రింత పెద్ద‌ద‌వుతోంది. ఈ టికెట్‌ను ఆశిస్తున్న‌ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆదితో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. టీడీపీ ఆవిర్భా వం నుంచి రాష్ట్రంలో, జిల్లాలో మంత్రులుకానీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కానీ నియోజకవర్గ టిక్కెట్లు ప్రకటించే సాంప్ర దాయం లేదు. కానీ, ఆది మాత్రం వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో త‌న‌కే టికెట్ ఇస్తార‌ని, త‌న గెలుపే ఖాయ‌మ‌ని ఇటీవ‌ల వ్యాఖ్య‌నించాడు. ఈ ప‌రిణామంతో రామ‌సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాడు. నిజానికి రామ‌సుబ్బా రెడ్డి.. వినయ విధేయతలు కలిగిన నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా.. పార్టీ అధిష్ఠానం చెప్పినట్లుగా నడుచుకుంటున్నాడు.