ఏపీలో దీక్ష‌.. తెలంగాణ‌లో వేడుక‌.. బాబు డ‌బుల్ గేమ్‌     2018-06-01   23:04:55  IST  Bhanu C

జూన్ 2న న‌వ నిర్మాణ దీక్ష‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సీఎం చంద్ర‌బాబు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేశారు. అంతేగాక ఆయ‌న కూడా ఇందులో పాల్గొన‌బోతున్నారు. రాష్ట్రాన్ని రెండుగా విభ‌జించి ఏపీకి అన్యాయం చేసింద‌ని కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జమెత్తుతున్న ఆయ‌న‌.. ఈసారి బీజేపీని టార్గెట్ చేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా అటుంచితే ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాలంటూ ఆదేశాలు జారీచేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఏపీలో తెలంగాణ ఏర్పాటును వ్య‌తిరేకిస్తూ దీక్ష‌లు చేపడుతూ.. మ‌రోప‌క్క తెలంగాణ ఏర్పాటు వేడుకలు నిర్వ‌హించాల‌ని తెలంగాణ నేత‌ల‌కు చెప్ప‌డం చూస్తుంటే.. చంద్ర‌బాబు మ‌ళ్లీ తన ట్రేడ్ మార్క్ అయిన రెండుక‌ళ్ల సిద్ధాంతాన్ని తెర‌పైకి తీసుకొచ్చార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

క‌ర్ర విర‌గ‌కూడ‌దు.. పాము చావ‌కూడ‌దు.. ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలికి బాగా స‌రిపోయే మాట‌. ఒక‌ప్ప‌టి రాష్ట్ర విభ‌జ‌న నాటి నుంచి నేటి వ‌ర‌కూ దానిని విడిచిపెట్ట‌కుండా మెయిన్‌టెన్ చేసుకుంటూ వ‌స్తున్నార‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఎందుకంటే విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌త్యేక తెలంగాణ‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూనే.. ఏపీలో పార్టీపై వ్య‌తిరేక‌త రాకుండా ఇక్క‌డి ప్ర‌యోజ‌నాలు కూడా ముఖ్య‌మేనంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమార‌మే రేపాయి. ఇప్పుడు మ‌ళ్లీ ఇదే త‌ర‌హా వ్య‌వ‌హార శైలితో వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఒకనాటి తనకే ప్రత్యేకమైన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మళ్లీ టీడీపీ అధ్యక్షుడు తెరమీదకు తెచ్చారు. గతంలో ఈ విధానాన్ని రాష్ట్ర విభజన విషయంలో అమల్లో పెట్టగా ఇప్పుడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో అమలులో పెడుతున్నారనే చర్చ జరుగుతోంది.