వైసీపీలో కులాల గోల‌.... జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్సే..!     2018-04-17   22:58:11  IST  Bhanu C

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నాడు. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంతో వైసీపీకి ఒక్క‌సారిగా ఊపు వ‌చ్చింది. మ‌రో వైపు జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు త‌న వంతుగా క‌ష్ట‌ప‌డుతున్నాడు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మంచి ఊపు వ‌చ్చింది. అయితే ఇదే టైంలో వైసీపీలో కులాల జ్వాల‌లు ఎగ‌సిప‌డుతున్నాయి. చివ‌ర‌కు పార్టీలో ఉన్న కులాల నాయ‌కులు జ‌గ‌న్‌కు అల్టిమేటం జారీ చేయ‌డంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పుతుందా ? అనే సందేహాలు కూడా క‌లుగుతున్నాయి.

వైసీపీపై ఇప్ప‌టికే రెడ్డి కులం ముద్ర బాగా ప‌డిపోయింది. పార్టీలో కీల‌క ప‌ద‌వులు అన్ని జ‌గ‌న్ త‌న సొంత సామాజిక‌వ‌ర్గం అయిన రెడ్డి కుల‌స్తుల‌కే క‌ట్ట‌బెడుతున్నార‌ని మిగిలిన కులాల్లో అసంతృప్తి చెల‌రేగింది. అంత‌కు ముందు పార్టీకి వ‌చ్చిన ఏకైక రాజ్య‌స‌భ సీటును రెడ్డి వ‌ర్గానికే చెందిన విజ‌య‌సాయిరెడ్డికి ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ద‌క్కిన రాజ్య‌స‌భ సీటుపై బీసీల‌తో పాటు కాపు వ‌ర్గానికి చెందిన పార్టీ నేత‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.

అంత‌కు ముందు రాజ్య‌స‌భ సీటు విజ‌య‌సాయిరెడ్డికి ఇవ్వ‌డంతో జ‌గ‌న్ ఖ‌చ్చితంగా ఈ సీటు బీసీల్లో లేదా కాపు ఉద్య‌మ నేప‌థ్యంలో ఆ వ‌ర్గానికే ఇస్తారని అంద‌రూ అనుకున్నారు. అయితే జ‌గ‌న్ రెండో రాజ్య‌స‌భ సీటునే రెడ్డి వ‌ర్గానికి చెందిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డికి ఇచ్చారు. వేమిరెడ్డి అదే నెల్లూరు జిల్లాకు చెందిన వారు కావ‌డం మ‌రో విచిత్రం. దీంతో కాపుల్లో ఒక్క‌సారిగా పెద్ద అసంతృప్తి వ్య‌క్త‌మైంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపుల‌కు బాగా ప్ర‌యారిటీ ఇచ్చారు.