టీడీపీకి గుదిబండగా మారిన ఎమ్యెల్యే బొండా ఉమ !     2018-05-30   23:42:07  IST  Bhanu C

శత్రువులు ఎక్కడో ఉండర్రా .. మన చుట్టూనే.. మన అక్కగానో .. చెల్లిగానో , కూతురిగానో కొడుకుగానో ఉంటార్రా.. అంటూ ఓ సినిమాలో బాగా పాపులర్ అయినా డైలాగ్ ఉంది. సరిగ్గా అలాంటి డైలాగ్ ఇప్పడు తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరిపోతుంది. పై స్థాయిలో చంద్రబాబు ఎంత కష్టపడినా … కింది స్థాయిలో ఎమ్యెల్యేలు దాన్ని నీరుగార్చేస్తున్నారు.
ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత టీడీపీ కొంప ముంచేటట్లే ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వరుస ఆరోపణలు వస్తుండటంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాపై భూ వివాదాలకు సంబంధించిన ఆరోపణలు రావడం పార్టీకి ఇబ్బందిగా మారింది. రాజధానికి దగ్గరగా ఆయన నియోజకవర్గం ఉండడంతో ప్రభుత్వం పరువు బజారున పడుతోంది.

బొండా ఉమ పై ఆరోపణలు కొత్తేమి కాదు. తరుచూ ఆయన వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు ఒక స్వాతంత్ర సమరయోధుడి భూమిని కబ్జా చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు గతంలో వచ్చాయి. అనంతరం ఇద్దరు మహిళలకు చెందిన 86 సెంట్ల భూమిని కాజేసేందుకు ప్రయత్నించారని బాధితులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. కేవలం బొండా ఉమనే కాదు, ఆయన భార్యపై కూడా ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఇక తాజాగా, మరో భూవివాదంలో బొండా పేరు వినిపిస్తోంది.