బాబు ని బెదిరిస్తోన్న బీజేపీ ! ఆ తప్పుల లెక్కలు బయటకి తీస్తారట !  

టీడీపీని దారిలోకి తెచ్చుకునేందుకు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని నిరంతరం టీడీపీ విమర్శలకు దిగుతోంది. ఆ విషయాలు మీడియాలో బాగా ఫోకస్ అవుతుండడం వల్ల బీజేపీ పరువు దేశవ్యాప్తంగా పోతోంది. దీంతో టీడీపీ ని కట్టడి చేయకపోతే ఎన్నికల నాటికి మరింత నష్టపోవడం ఖాయం అనే అభిప్రాయానికి వచ్చింది బీజేపీ అందుకే టీడీపీ మీద విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. వీటితో పాటు కేంద్ర నిధులకు సంబంధించి లెక్కలు అడుగుతూ ఏదో ఒక విషయంలో ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. కొన్ని అవినీతి కి సంబంధించి ఆధారాలు సంపాదించినట్టు చెప్తోంది బీజేపీ.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు టీడీపీ పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ పాపాల చిట్టా తన దగ్గర ఉందని పార్లమెంట్ వేదికగా వాటిని బయటపెడతానని జీవీఎల్ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సభను అడ్డుకునే ప్రయత్నాలు టీడీపీ చేస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏదో చేసేస్తాం అంటూ టీడీపీ ఎంపీలు విర్రవీగుతున్నారని కానీ టీడీపీ అంటేనే టోటల్ డ్రామా పార్టీ అని ఆయన కొత్త మీనింగ్ చెప్పారు. టీడీపీ ఏదో పొడిచేస్తాం అని విర్రవీగుతున్నారని వారి బెదిరింపులు తాటాకు చప్పుల్లేనని నరసింహారావు కవ్వింపు ధోరణిలో మాట్లాడారు.

బీజేపీతో అంటకాగినంత కాలం బీజేపీని పొగిడి ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విమర్శలకు దిగుతోందని ఇంతకన్నా అవకాశవాదం ఏమైనా ఉంటుందా అంటూ ఆయన టీడీపీ మీద విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు పోలవరంకు వారం వారం వెళ్లి ఏమి సాధిస్తున్నారని జీవీఎల్ ప్రశ్నించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీపై డ్రామాలాడుతున్నారని, స్టీల్ ప్లాంట్ రాకుండా అడ్డుకుంటున్నది తెలుగుదేశమేనని నరసింహారావు కుండబద్దలు కొట్టారు. ఇలా వరుసగా అనేక విషయాల మీద ఫైర్ అయిన ఆయన టీడీపీ జాతకం త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు.