అన్యాయంగా ... అన్యాయం చేశారు ! ఈ పాపం ఆ పార్టీలదేనా ..?  

బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ నాలుగేళ్లపాటు దోస్త్ మేరా దోస్త్ అంటూ చెట్టాపట్టాలేసుకున్నారు.. కేంద్రంలో టీడీపీకి..ఏపీలో బీజేపీకి మంత్రి పదవులు పంచుకున్నారు. కానీ ఎప్పుడెప్పుడూ కూడా .. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, లోటు భర్తీ లాంటి విషయాలపై నోరు మెదపకపోయినా టీడీపీ కిక్కురుమనలేదు. అంతే కాదు… హోదా కోసం, రైల్వేజోన్ కోసం ఉద్యమాలు చేసిన వైసిపి తదితర పార్టీలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు.

ఏపీని అభివృద్ధి చేయడంలో కూడా బాబు దాదాపుగా ఫెయిల్ అయినట్టే కనిపించింది. సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందటం లేదన్న ఆరోపణలు పెరిగిపోయాయి. జన్మభూమి కమిటీల ఆధిపత్యం పెరిగిపోవటంతో గ్రామ స్ధాయిలో గొడవలు ఎక్కువైపోయాయి. దాంతో రాజకీయాలతో సంబంధం లేని సామాన్య జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది.

ఏపిని మోసం చేయటంలో బిజెపికి ఎంత పాత్ర ఉందొ.. చంద్రబాబుకూ అంతే పాత్ర ఉంది. ఎందుకంటే, నాలుగేళ్ళపాటు కేంద్రం చేసిన మోసాన్ని చంద్రబాబు ఎప్పుడూ నిలదీయలేదు. పైగా కేంద్రం ఏపికి చాలా సాయం చేసిందని, దేశంలో ఏ రాష్ట్రానికి రానంత సాయం ఏపికి వచ్చిందని ఎన్నోసార్లు బాబు చెప్పడం ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. వాస్తవంగా చూసుకుంటే ఏపీకి టీడీపీ .. బీజేపీ రెండు పార్టీలు అన్యాయం చేసాయనడం లో సందేహమే లేదు.