బిగ్‌బాస్‌ 2.. రెండు విషయాల్లో మేం చెప్పిందే జరిగింది     2018-06-17   22:20:09  IST  Raghu V

భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2 మొదటి వారం పూర్తి చేసుకుంది. హౌస్‌లో సెలబ్రెటీలు లేరని, ఇంట్లో ఉన్న వారు పెద్దగా ఎంటర్‌టైన్‌ చేయలేక పోతున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బిగ్‌బాస్‌ 2 మొదటి వారంలో ఎలిమినేషన్‌ జరిగింది. షో ప్రారంభం అయిన రెండవ రోజునే బిగ్‌బాస్‌ మొదటి వారం ఎలిమినేషన్‌ జాబితాలో సంజన ఉంటుందని మేం చెప్పాం. ఆ తర్వాత కూడా ఎలిమినేషన్‌లో ఉన్న వారందరిలో కూడా సంజన కాస్త అతిగా ప్రవర్తిస్తుందని, ఆమెకు ప్రేక్షకుల మద్దతు దక్కడం కష్టమే అంటూ తాము విశ్లేషించాం. తాము చెప్పిట్లుగానే నిన్న ఎలిమినేషన్‌ ద్వారా సంజన బయటకు వచ్చేసింది.

ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా గొడవ పడుతూ మాట్లాడటం, ప్రతి ఒక్కరి గురించి కూడా చెడుగా మాట్లాడటం వంటివి చేసిన సంజనను ప్రేక్షకులు పెద్దగా కోరుకోలేదు. ఎలిమినేషన్‌లో ఉన్న వారిలో దీప్తి సునైనకు భారీగా ఓట్లు రావడం జరిగింది. దాంతో ఆమెను మొదటే సేఫ్‌ అంటూ ఎన్టీఆర్‌ ప్రకటించాడు. సంజన విషయంలో ప్రేక్షకులు ఆసక్తి చూపించక పోవడంతో బిగ్‌బాస్‌ ఇంటి నుండి ఆమె మొదటి వారంలోనే బయటకు వచ్చేసింది. ఇంట్లో అందరితో కలిసి పోయినట్లుగా ఉండటంతో పాటు, అందరితో సరదాగా ఉండే వారికి ఓట్లు దక్కుతాయని సంజన ఉదంతం నిరూపించింది.