ఒకప్పుడు బిచ్చగాళ్ళు...ఇప్పుడు నెలకు పది వేలకు పైగా సంపాదిస్తున్నారు.! కారణం ఆ యువతి.!     2018-06-05   03:56:57  IST  Raghu V

నగరంలో రోడ్లపై ఒకటే ట్రాఫిక్, ఆ ట్రాఫిక్ మధ్యలో అయ్యా,అమ్మా అంటూ అడుక్కునే బిచ్చగాళ్ళు, చదువుకునే వయసులో రోడ్డెక్కిన పిల్లలు, పనిలేక గుడి మెట్లపై అడుక్కుంటున్న పనిచేయగల వయసున్న వారు. ఇలా ఎంతోమంది బిచ్చగాళ్ళు యాచన చేస్తూ జీవితం గడుపుతున్నారు. దీనికి కారణం పేదరికం, పనిదొరక్కపోవడం .. ఇలా ఎన్నో కారణాలు కావచ్చు. ఇలాంటి వారందరినీ ఒకేచోటికి చేర్చి నెలకు రూ.10,000 సంపాదించుకునేలా పని కల్పించింది స్వాతి బాండియా.

ఒకరోజు ఆటోలో వెళ్తున్న స్వాతి దగ్గరకు ఒకమ్మాయి వచ్చి, అమ్మా ధర్మం చేయండని చేయి చాచింది. ఇలా డబ్బులిచ్చి బిచ్చగాళ్ళను, యాచించేవారిని ఎంకరేజ్ చేయడం ఇష్టంలేని స్వాతి ఇవ్వనని, లేదని చెప్పింది. ఆ అమ్మాయి అలానే అడుగుతూ నిల్చొని ఉంది. ఇక ఇంకో అమ్మాయి ఏవో చిన్న వస్తువలు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పట్టుకొని అమ్ముతోంది. అమ్మా ఈ వస్తువులు తీసుకోండి కేవలం రూ.10 అని చెప్పింది. స్వాతి దగ్గర డబ్బులు ఉన్నా, ఎందుకో కొనడానికి ఇష్టపడలేదు. పైన భగభగ మండుతున్న సూర్యుడు, కాళ్ళకు చెప్పులు లేకుండా నడి రోడ్ పై పరిగెత్తుకుంటూ సిగ్నల్స్ దగ్గర ఆ వస్తువులను అమ్ముకుంటున్నారు. వాళ్ళను చూసి జాలి కలిగింది స్వాతికి.వారి నేఫధ్యం, వారు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళు నివసిస్తున్న చోటుకు వెళ్ళింది. చిన్న చిన్న గుడిసెల్లో కొందరు బ్రతుకుతుంటే, మరికొందరు ఫ్లై ఓవర్ల కింద జీవనం సాగిస్తున్నారు. వీరంతా పనికోసం నగరానికి వచ్చిన వలస కార్మికులు.అయితే ఇక్కడ పనిలేకపోవడంతో పొట్టకూటి కోసం ఇలా బిచ్చగాళ్ళుగా మారి యాచిస్తూ పొట్ట నింపుకుంటున్నారు. ఈ పని చేయడం ఇష్టంలేకపోయినా, వేరే పనిచేయడానికి ఆసరా లేదు.