భరత్‌కు నెం.3 ఆశలు అడియాశలు    2018-05-09   01:05:23  IST 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో ‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత వచ్చిన చిత్రం భరత్‌ అనే నేను. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్‌ నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంటుందని అంతా నమ్మకం వ్యక్తం చేశారు. శ్రీమంతుడు చిత్రంతో రికార్డులు బ్రేక్‌ చేసిన ఈ కాంబో మరోసారి సంచలన వసూళ్లు సాధించడం ఖాయం అంటూ అంతా భావించారు. అంతా అంచనాలు పెట్టుకున్నట్లుగానే భారీ ఓపెనింగ్స్‌ ఈ చిత్రంకు దక్కాయి. మొదటి మూడు రోజుల్లోనే సునాయాసంగా 125 కోట్ల వసూళ్లను రాబట్టి నాన్‌ బాహుబలి రికార్డును దక్కించుకుంటుందని నమ్మకం కలిగించింది.?

వారం రోజుల తర్వాత అంచనాలు తలకిందులు అయ్యాయి. ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టడంలో భరత్‌ వెనుక పడ్డాడు. రెండు వందల కోట్ల క్లబ్‌లో అయితే భరత్‌ చేరాడు కాని అనుకున్నట్లుగా నెం.3 స్థానంను దక్కించుకోలేక పోయాడు అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. రామ్‌ చరణ్‌ నటించిన రంగస్థలం చిత్రం 200 కోట్లను వసూళ్లు చేయడంతో పాటు ఏకంగా 125 కోట్ల షేర్‌ను రాబట్టింది. అయితే భరత్‌ పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. 200 కోట్లను వసూళ్లు చేసిన భరత్‌ 110 కోట్లకు లోపు షేర్‌ను రాబట్టాడు. పలు ఏరియాల్లో భరత్‌ సినిమా ఇంకా నష్టాల్లోనే నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.