అతడు ఏ దేశం తరపునా క్రికెట్ ఆడలేదు..ఇతడు బ్యాటింగ్ చేయని బ్యాట్ మాన్  

అతడు ఏ దేశం తరపునా క్రికెట్ ఆడలేదు.. బ్యాట్ చేత పట్టుకుని గ్రౌండ్లో పరుగుల వర్షం కురిపించలేదు..అసలతను క్రికేటరే కాదు అయినప్పటికి అతను బ్యాట్స్ మనే.. అదెలా అంటారా..మనకున్న అలవాట్లు,అభిరుచులు,మనం సేకరించే వస్తువులు వాటి ఆధారితంగానే గుర్తింపు పొందుతారు.ధర్మవీర్ దుగ్గల్ బ్యాట్ మ్యాన్ గా గుర్తింపు పొందడానికి గల కారణం కూడా అదే…

ధర్మవీర్ కొన్నేళ్లుగా క్రికెట్ సంబంధిత అపురూపమైన వస్తువులను సేకరిస్తున్నారు. అతని దగ్గర ఇంటర్నేషనల్ క్రికెటర్స్ సైన్ చేసిన 572 బ్యాట్స్ ఉన్నాయి.1992 మంది క్రికెట్ ప్లేయర్ల ఆటోగ్రాఫ్‌లున్నాయి. వీవీ రిచెర్డ్స్ మొదలుకొని విరాట్ కోహ్లీవరకూ అందరి ఆటోగ్రాఫ్‌లతో కూడిన బ్యాట్స్ ధర్మవీర్ దగ్గరుండటం విశేషం.. ప్రముఖ క్రికెటర్లు లాలా అమర్‌నాథ్, హనీఫ్ మొహమ్మద్, బ్రాయన్ లారా, సచిన్ టెండుల్కర్, మొహమ్మద్ అజారుద్దీన్, రిక్కీ పాంటింగ్ తదిరులంతా సంతకం చేసిన ఒక బ్యాట్ ధర్మవీర్ దగ్గరురుంది. ఆయన దీనిని గోల్డెన్ బ్యాట్‌గా చెబుతుంటారు.

పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ సంతకంతో కూడిన బ్యాట్ కూడా ధర్మవీర్ దగ్గరుంది. ఇమ్రాన్‌ఖాన్ 1977లో ఇంగ్లాండ్‌లో కౌంటీ ఆడుతున్న సందర్భంలో ధర్మవీర్‌కు ఉత్తరం కూడా రాశారు. 2004లో ధర్మవీర్ ఇమ్రాన్‌ఖాన్‌ను కలుసుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్ తాజాగా పాక్ పీఎం కానుండటంతో ధర్మవీర్ అతనికి అభినందలతో కూడిన ఉత్తరం కూడా రాశారు. ఇదీ ఛండీగడ్ కి చెందిన ధర్మవీర్ బ్యాట్ మన్ గా గుర్తింపు పొందడం వెనుకున్న కథా కమామీషు.