బండ్ల గణేష్‌ తీరు అర్థం కావడం లేదే!     2018-07-01   00:02:20  IST  Raghu V

తెలుగు ప్రేక్షకులకు బండ్ల గణేష్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. నటుడిగా పరిచయం అయిన బండ్ల గణేష్‌, ఆ తర్వాత నిర్మాతగా మారి పలు చిత్రాలను నిర్మించాడు. ఈయన నిర్మించిన ఎక్కువ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో గత కొంత కాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. వ్యాపారం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న బండ్ల గణేష్‌ గత కొంత కాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో బండ్ల గణేష్‌ ఉన్నాడు అంటూ రాజకీయ వర్గాల్లో మరియు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

బండ్ల గణేష్‌కు అత్యంత ఆప్తుడు పవన్‌ కళ్యాణ్‌. తన అభిమాన హీరో పవన్‌ కళ్యాణ్‌ అంటూ, పవన్‌ను పల్లెత్తు మాట అన్నా కూడా ఊరుకోను అంటూ బండ్ల గణేష్‌ చెబుతూ వస్తుంటాడు. ఎవరైనా పవన్‌ గురించి మాట్లాడితే వెంటనే ట్విట్టర్‌ ద్వారా వారిపై కౌంటర్‌ వేయడం, వారిపై విమర్శలు చేయడం బండ్ల గణేష్‌ చేస్తూ ఉంటాడు. ఆ కారణంగానే పవన్‌ జనసేనలో బండ్ల గణేష్‌ క్రియాశీలకంగా ఉంటాడు అంటూ అంతా భావిస్తున్నారు. అయితే బండ్ల గణేష్‌ మాత్రం ఒకసారి కాంగ్రెస్‌ వైపు మరోసారి టీడీపీ వైపు ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈయన జనసేనపై ఆసక్తి ఉన్నట్లుగా ప్రవర్తించడం లేదు. పవన్‌ అంటే అభిమానం కాని జనసేన అంటే ఆసక్తి లేదు అంటూ గతంలో చెప్పుకొచ్చాడు.