నిర్మాతల కోసమే మీడియా బ్యాన్‌?    2018-04-26   04:36:13  IST  Raghu V

పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డితో వర్మ చేయించిన వ్యాఖ్యలను కొన్ని ఛానెల్స్‌ పదే పదే ప్రసారం చేయడం జరిగింది. దాంతో పవన్‌ కళ్యాణ్‌ ఆ ఛానెల్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. దాంతో పాటు ఫిల్మ్‌ ఛాంబర్‌లో మీడియాలో తనపై జరుగుతున్న దాడికి సినిమా పెద్దలు ప్రశ్నించాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే న్యూస్‌ ఛానెల్స్‌ను సినిమా పరిశ్రమ బ్యాన్‌ చేయాలి అంటూ ప్రతిపాధనను మెగా క్యాంప్‌ తీసుకు వచ్చింది. సినిమా పరిశ్రమ పెద్దలు కొందరు భేటీ అయిన సమయంలో అల్లు అరవింద్‌ ఈ విషయాన్ని ప్రస్థావించడం జరిగిందని, అందుకు ఎక్కువ శాతం మంది నో చెప్పినట్లుగా తెలుస్తోంది.

సినీ ప్రముఖుల భేటీలో న్యూస్‌ ఛానెల్స్‌పై బ్యాన్‌ కుదరని కారణంగా హీరోల భేటీ నిర్వహించి అందులో బ్యాన్‌ విషయాన్ని చర్చించారని తెలుస్తోంది. అయితే ఆ భేటీలో నిర్మాతల శ్రేయస్సు కోసం, పబ్లిసిటీ ఖర్చులు తగ్గించుకోవడం కోసం సినిమాల ప్రమోషన్‌ను న్యూస్‌ ఛానెల్స్‌లో చేయకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌లో మాత్రమే సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే తెలుగులో కూడా అదే విధానాన్ని తీసుకు రావడం వల్ల నిర్మాతలకు భారీగా ఖర్చు ఆదా అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.