బాలయ్య కాస్త ఓపిక పట్టులేవా?     2018-05-11   01:49:29  IST  Raghu V

నందమూరి బాలకృష్ణ సినిమాల ఎంపిక విషయంలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటాడు. ఆలోచించకుండా, హడావుడిగా సినిమాలను ఎంపిక చేస్తాడని, దర్శకుల గురించి, సినిమా కథ గురించి ఆయన పెద్దగా ఆలోచించడు అంటూ విమర్శలు ఉన్నాయి. నందమూరి అభిమానులు కూడా ఇదే విషయమై పలు సందర్బాల్లో బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా బాలయ్య తన నిర్ణయ విధానంను మార్చుకోవడం లేదు. ఇటీవల తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించాలని భావించాడు. కాని అది ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వెంటనే మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

ఎన్టీఆర్‌ సినిమా దర్శకుడు తేజ తప్పుకోవడంతో ఆ సినిమా కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. దాంతో ఖాళీగా ఉండటం ఎందుకని వినాయక్‌ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వినాయక్‌ కథ కూడా సిద్దం చేసుకోకుండానే బాలయ్య ఓకే చెప్పాడు. దాంతో ఇప్పుడు హడావుడిగా బాలయ్య కోసం వినాయక్‌ కథ సిద్దం చేస్తున్నాడు. వచ్చే నెలలో వినాయక్‌ దర్శకత్వంలో సి కళ్యాణ్‌ బ్యానర్‌లో బాలయ్య సినిమా పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయాలనే షరతు దర్శకుడికి బాలయ్య పెట్టినట్లుగా తెలుస్తోంది.