ఎన్టీఆర్‌లో దగ్గుబాటి పాత్రపై బాలయ్య వర్సెస్‌ క్రిష్‌  

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. తన తండ్రి బయోపిక్‌ చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న బాలకృష్ణ ఇన్నాళ్లకు ఈ చిత్రాన్ని ప్రారంభించాడు. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతన్న ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. తాజాగా రెండవ షెడ్యూల్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. రెండవ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానం గురించిన కొన్ని సీన్స్‌ను షూట్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడుతో పాటు మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా కీలకంగా ఉన్నారు.

ఎన్టీఆర్‌ రాజకీయ జీవితం చూపించాలి అంటూ చంద్రబాబు నాయుడు పాత్రతో పాటు దగ్గుబాటి పాత్ర కూడా చూపించాల్సిందే అంటూ దర్శకుడు క్రిష్‌ అభిప్రాయ పడుతున్నాడు. కాని బాలకృష్ణ మాత్రం దగ్గుబాటి పాత్రను చూపించవద్దని కోరుతున్నాడు. చంద్రబాబు నాయుడుకు దగ్గుబాటికి మద్య తీవ్రమైన విభేదాలున్నాయి. ఎన్టీఆర్‌ నుండి అధికారంను లాక్కున్న సమయంలో ఇద్దరు సన్నిహితంగానే ఉన్నా కూడా, చివరి నిమిషంలో అంతా కూడా చంద్రబాబు నాయుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు.

చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత తనను పట్టించుకోక పోవడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో చంద్రబాబు పై విరుచుకు పడటం జరిగింది. దాంతో చంద్రబాబు నాయుడుకు అప్పటి నుండి కూడా దగ్గుబాటితో సన్నిహిత సంబంధాలు లేవు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్‌ మూవీలో దగ్గుబాటి పాత్ర ఉంటే తన వియ్యంకుడు అయిన చంద్రబాబు నాయుడు ఫీల్‌ అవుతాడేమో అనే ఉద్దేశ్యంతో బాలకృష్ణ ఆ పాత్రను వద్దంటున్నాడు.

క్రిష్‌ మాత్రం దగ్గుబాటి పాత్ర లేకుండా సినిమా చేస్తే లోటుగా ఫీలింగ్‌ ఉంటుందని, ఎక్కువ సీన్స్‌ వేయకుండా మూడు నాలుగు సీన్స్‌లో ఆయన్ను ఉంచి, అది కూడా ప్రాముఖ్యత లేకుండా దగ్గుబాటి పాత్రను ఒక సాదారణ నటుడితో లేదంటే కొత్త వ్యక్తితో చేయించాలని క్రిష్‌ చెబుతున్నాడు. క్రిష్‌ కన్విన్స్‌ చేయడంతో బాలకృష్ణ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడుగా రానా నటిస్తుండగా, దగ్గుబాటి పాత్రలో కొత్త నటుడు నటించే అవకాశం ఉంది.