స్టార్‌ అవుతాడనుకుంటే ఛాన్స్‌లే కరువాయే     2018-05-09   06:58:48  IST  Raghu V

రచయితగా ఎన్నో సూపర్‌ హిట్స్‌ను అందుకున్న వక్కంతం వంశీ తాజాగా దర్శకుడిగా ‘నా పేరు సూర్య’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వక్కంతం వంశీకి ముందు ఎంతో మంది రచయితలు దర్శకులుగా మారిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌, కొరటాలలు రచయితలుగా చేసి దర్శకులుగా అయ్యారు. వారి దారిలోనే వక్కంతం వంశీ కూడా టాలీవుడ్‌ టాప్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడని, మంచి రచయితకు మంచి దర్శకుడిగా పేరు వస్తుందని అంతా భావించారు. వంశీ మొదటి సినిమాతోనే స్టార్‌ అవుతాడని, ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు సైతం క్యూ కట్టాల్సిందే అని అంతా భావించారు. కాని ఫలితం తారు మారు అయ్యింది.

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అంటూ ఒక తెలుగు సినిమాలో పాట ఉంది. ఆ పాటలో మాదిరిగా ఇప్పుడు వక్కంతం వంశీ పరిస్థితి ఉంది. దర్శకుడిగా నా పేరు సూర్యతో సక్సెస్‌ కొడితే రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్స్‌ పిలిచి మరీ అవకాశాలిస్తారని భావించాడు. కాని బన్నీతో తెరకెక్కించిన ‘నా పేరు సూర్య’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేక పోతుంది. రచయిత అయ్యి ఉండి మంచి కథను రాసుకోవడంలో వంశీ విఫలం అయ్యాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో ఈయనతో సినిమాలు చేసేందుకు ప్రస్తుతం ఏ హీరో కూడా ఆసక్తిగా లేడని తెలుస్తోంది.