బాబు కేబినెట్లో గుండెలు తీసిన బంటు     2018-06-08   00:27:39  IST  Bhanu C

మ‌రోసారి రాష్ట్ర కేబినెట్‌ను సీఎం చంద్ర‌బాబు విస్త‌రిస్తార‌నే ప్రచారం జోరందుకుంది. ప్ర‌స్తుతం కొంద‌రు మంత్రులపై అవినీతి ఆరోప‌ణ‌లతో పాటు వారి వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌క్షాళ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌నే చ‌ర్చ పార్టీలో జ‌రుగుతోంది. ఎవ‌రికి ఉద్వాస‌న ప‌లుకుతారు? ఎవ‌రిని కొత్త‌గా తీసుకుంటార‌నే విష‌యంపై పార్టీలో అప్పుడే గుస‌గుస‌లు ప్రారంభ‌మ‌య్యాయి. కొత్త‌వారి పేర్లు ప్ర‌స్తుతం వినిపించ‌కున్నా.. ఉద్వాస‌న ప‌లికే వారి జాబితాలో మాత్రం రాయ‌లసీమ జిల్లాల‌కు చెందిన మంత్రి పేరు గ‌ట్టిగానే వినిపిస్తోంది. ఈసారి ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేయ‌డం ఖాయ‌మ‌ని పార్టీలోని సీనియ‌ర్లు కూడా స్ప‌ష్టంచేస్తున్నారు. ఆయ‌న టీడీపీలో ఉన్నా.. ప్ర‌తిప‌క్ష వైసీపీపై వ‌ల్ల‌మాలిన అభిమానాన్ని చూపుతుండ‌టాన్ని వీరు జీర్ణించుకోలేక‌పోతున్నారట‌. వైసీపీ నేత‌ల‌ను ప్రోత్స‌హిస్తూ.. టీడీపీ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ని తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ట‌. ఈ విష‌యం సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కూ వెళ్లింద‌ట‌!!

తొలిసారి ఎమ్మెల్యే అయిన‌ ఆయ‌న టీడీపీలో ఉన్నా.. ఆలోచ‌న‌ల‌న్నీ వైసీపీ నేత‌ల గురించేన‌ట‌. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో దోస్తీ మ‌రింత పెరిగింద‌ట‌. గ‌తంలో వైసీపీలో చేరేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసినా అవ‌న్నీ బెడిసికొట్ట‌డంతో పాపం మ‌న‌సు చంపుకొనే టీడీపీలో కొన‌సాగుతున్నార‌ట‌. వెనుక బ‌డిన రాయ‌ల‌సీమ జిల్లాకు చెందిన వ్య‌క్తి కావ‌డంతో మంత్రి ప‌ద‌వి అప్ప‌గించి.. ఎక్కువ ప్రాధాన్య‌మిస్తే చివ‌ర‌కు బాబుకే ఎగ‌నామం పెడుతున్నాడ‌ని పార్టీలోని సీనియ‌ర్లు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తంచేస్తున్నార‌ట‌. ప్రతి చిన్న విషయంలోనూ ఆయనకు ప్రాధాన్యత కల్పిస్తూ పలు నిర్ణయాల్లో ఆయనను భాగస్వామిని చేసినా.. ఆయ‌న మాత్రం వైసీపీ నేత‌ల‌కే ల‌బ్ధి చేకూరేలా చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకానికి తూట్లు పొడుస్తూ.. ఆ మంత్రి వైసీపీతో చేతులు కలిపారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.