బాబు స్ట్రాట‌జీతో జ‌గ‌న్‌కు విజ‌య‌మ్మ టెన్ష‌న్‌..!  

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ త‌ల్లి వైఎస్‌.విజ‌య‌ల‌క్ష్మికి రాజ‌కీయంగా అస్స‌లు క‌లిసిరావ‌డం లేదు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి మృతి త‌ర్వాత పులివెందుల ఉప ఎన్నిక‌ల్లో ఆమెను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమె కూడా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీ నుంచి ఉప ఎన్నిక‌ల్లో మ‌రిది వివేకానంద‌రెడ్డి మీదే భారీ మెజార్టీతో గెలిచారు. 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పులివెందుల‌లో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డంతో విజ‌య‌మ్మ‌ను విశాఖ నుంచి బ‌రిలోకి ఎంపీగా దింపారు. జ‌గ‌న్ స్ట్రాట‌జీ రాంగ్ అవ్వ‌డంతో విజ‌య‌మ్మ రాజ‌కీయాల్లో అప్ప‌ట‌కి అనామ‌కుడు అయిన బీజేపీ అభ్య‌ర్థి కంభంపాటి హ‌రిబాబు చేతిలో ఘోరంగా ఓడిపోయారు.

నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న వైఎస్ ఫ్యామిలీకి విజ‌య‌మ్మ ఓట‌మి ఘోర అవ‌మాన‌మే. ఆ త‌ర్వాత ఆమె చాలా రోజుల పాటు బ‌య‌ట‌కే రాలేదు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల వేళ కొడుకును సీఎం చేసేందుకు మ‌ళ్లీ రాజ‌కీయ క్షేత్రంలోకి దిగారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ విజ‌య‌మ్మను విశాఖ ఎంపీగా పోటీ చేసి రాంగ్ స్టెప్ వేశారు. ఈ సారి ఆమెను సొంత జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాల‌ని కొద్ది రోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.


ముందుగా పార్టీ మారిన మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం అయిన జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆమెను బ‌రిలోకి దింపాల‌ని అనుకున్నారు. అయితే అక్క‌డ రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వ‌డంతో ఈ రెండు వ‌ర్గాలు క‌లిస్తే విజ‌య‌మ్మ‌కు మ‌ళ్లీ ఇబ్బందే అవుతుంది. అప్పుడు ఆమె కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌చారానికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న క‌మ‌లాపురం కోసం కూడా విజ‌య‌మ్మ పేరు ప‌రిశీల‌న‌కు వ‌చ్చింది.